చిత్తూరు (అర్బన్): ఒక విద్యార్థి (చంద్ర) ఎంబీఏ పూర్తి చేశాడు. మరో విద్యార్థి (కుమార్) డిగ్రీ పాసయ్యాడు. ఇద్దరూ స్నేహితులు. కాపురం ఉండేది పెనుమూరు మండలం. ఉండే ఊర్లో ఉద్యోగం చేస్తే కాస్త తక్కువ జీతాలు వస్తాయని భావించి విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు.
ఇంతలో శరవణకుమార్ అనే వ్యక్తి తానో కన్సల్టెన్సీ పెట్టుకున్నానని, మలేషియాలోని ఓ స్టార్ హోటల్‌లో ఎంబీఏ చదివిన వ్యక్తికి సూపర్‌వైజర్ పోస్టు, డిగ్రీ చదివిన వ్యక్తికి అకౌంటెంట్ పోస్టు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇద్దర్నీ మధురైలోని దిండుగల్లు రమ్మన్నాడు. ఉద్యోగాల కోసం వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అక్కడున్న పరిస్థితిని చూసి తమకు మలేషియాలో ఉద్యోగాలు వచ్చేస్తాయని నమ్మారు. ఒక్కో ఉద్యోగానికి రూ.1.5 లక్షలు డిమాండ్ చేయడంతో ఊరికి వెళ్లి డబ్బులు సర్దుకుని ఫోన్ చేస్తామని చెప్పారు.
విషయం తల్లితండ్రులకు చెప్పడంతో ఉన్న సొమ్ములు తాకట్టుపెట్టి ఇద్దరూ రూ.1.15 లక్షల వంతున ఇచ్చా రు. వచ్చిన నగదును శరవణకుమార్‌కు చేతికి ఇస్తే ఎలాంటి ఆధారం లేకుండా పోతుందని ఆన్‌లైన్ నుంచి ఎదుటి వ్యక్తి ఖాతాకు రూ.2.3 లక్షలను బదిలీ చేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తోంది. శరవణకుమార్ నుంచి ఎలాంటి ఫోన్లూ రాలేదు. ఈ-మెయిల్స్‌కు సమాధానమూ లేదు.
దీంతో చేసేదేమీ లేక ఇద్దరు వ్యక్తులు బుధవారం చిత్తూరు ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్నతాధికారులకు వివరాలు నివేదించడంతో దర్యాప్తు ప్రారభించారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట కొన్ని సంస్థలు ఆన్‌లైన్‌లో గాలాలు వేసి వచ్చినకాడికి దోచుకుని వెళ్లిపోతున్నాయని ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఎస్పీ రామకృష్ణ సూచించారు.
మలేషియాలో ఉద్యోగాల పేరిట టోకరా
Published Thu, Jun 26 2014 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM
Advertisement
Advertisement