సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా సారథ్యంపై కాంగ్రెస్‌లో కొత్త కిరికిరి మొదలైంది. కేఎం ప్రతాప్‌ను డీసీసీ అధ్యక్షుడిగా పేర్కొంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండు దశాబ్ధాలు జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు నిర్వర్తించిన ప్రతాప్‌ను తప్పించి ఆయన స్థానంలో క్యామ మల్లేశ్‌ను నియమిస్తూ కొన్నాళ్ల క్రితం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని మొదట్నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతాప్ ఇప్పటికీ తానే డీసీసీ ప్రెసిడెంట్‌నని చెప్పుకుంటున్నారు. పార్టీ నియమావళికి అనుగుణంగా నియామకం జరగలేదని, మల్లేశ్‌ను ఇన్‌చార్జిగా మాత్రమే నియమించారని ఆయన వాదిస్తున్నారు. అంతేగాకుండా.. జిల్లా కాంగ్రెస్ కమిటీలను ఏఐసీసీ ప్రకటిస్తుంది తప్ప పీసీసీ కాదని పేచీ పెట్టారు.
ఈ క్రమంలోనే గాంధీభవన్‌లోని డీసీసీ కార్యాలయంలోకి తాళాలు పగలగొట్టి చొరబడ్డారని మల్లేశ్‌పై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రతాప్ ఫిర్యాదు కూడా చేశారు. ఈ పరిణామక్రమంలోనే డీసీసీ అధ్యక్షుడిగా మల్లేశ్ పగ్గాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు సహా పలువురు సీనియర్లు పాల్గొన్నారు. పార్టీ వ్యవహారాల్లో మల్లేశ్ నాయకత్వానికి ముఖ్యనేతలు సహకరిస్తున్నప్పటికీ, ప్రతాప్ మాత్రం ససేమిరా అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అనుచరులు ఒక పత్రికలో యాడ్ ఇచ్చారు. ఇందులో ప్రతాప్‌ను డీసీసీ అధ్యక్షుడిగా పేర్కొన్నారు. ఇది తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. కొత్తగా నియమించిన డీసీసీ అధ్యక్షులందరినీ ఇన్‌చార్జిలుగానే సంబోధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, దీంతో తాను తాత్కాలికమేనని కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడం సరికాదని మల్లేశ్ స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పత్రికలో ప్రతాప్ పేరిట వచ్చిన ప్రకటనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీ వ్యవహారాల్లో సహకరించకుండా వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నారని బొత్సకు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కేఎం ప్రతాప్‌పై అధిష్టానానికి మల్లేశ్ ఫిర్యాదు
Published Sat, Sep 28 2013 2:37 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement