చిన్నారులపై గోపీకృష్ణ కీచకపర్వం
విజయవాడ : అనాథ బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న షిర్డీ సాయి ఆశ్రమ నిర్వాహకుడిని సత్యనారాయణపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యర్రంశెట్టి గోపీకృష్ణ అనే వ్యక్తి గతంలో రైల్వేలో టీటీఈగా పనిచేశాడు. ఏలూరులో ఇతడిపై హత్యాయత్నం కేసు నమోదవడంతో 2005లో ఉద్యోగం నుంచి తొల గించారు. ఇతడికి ముగ్గురు భార్యలు.
గోపీకృష్ణ ఖుద్దూస్‌నగర్ మట్టిరోడ్డులో ఆరేళ్ల కిందట శ్రీ షిరిడీ సాయిబాబా ఆశ్రమాన్ని స్థాపించాడు. ముగ్గురు భార్యలకు పుట్టిన పిల్లలతో పాటు కొందరు అనాథ బాలలను చేర్చుకుని ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అందులోని అనాథలకు భోజనం పెట్టి పాఠశాలకు పంపిస్తుంటాడు. వారు రాత్రిళ్లు ఆశ్రమంలోనే ఉంటారు. దీని నిర్వహణకు నలుగురు ఉద్యోగులను ఏర్పాటు చేసుకున్నాడు. వారి ద్వారా చందాలు సేకరించి, ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు.
అందులోని బాలికలతో పనులు చేయిస్తుంటాడు. రాత్రివేళల్లో వారితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. దీనిపై చైల్డ్‌లైన్‌కు కొంతమంది సమాచారం అందించారు. వారు ఆశ్రమానికి వచ్చి బాలబాలికల నుంచి వివరాలు సేకరించారు. అ నంతరం చైల్డ్‌లైన్‌కు తరలించారు. గోపీకృష్ణపై జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ పి.లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.