మంచినీటిలో విషం.. విద్యార్థులకు తప్పిన అపాయం
చేగుంట, న్యూస్‌లైన్: పాఠశాల వద్ద ఉన్న కుక్కలను చంపాలని భావించిన ఓ ప్రబుద్ధుడు... విద్యార్థులు తాగే నీటిలో విషం కలిపాడు. ముందుగానే ఆ విషయం బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన శనివారం మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో కలకలం రేపింది. వివరాలివీ...రెడ్డిపల్లి పాఠశాలలో విద్యార్థుల కోసం ఓ నీటి డబ్బాను ఏర్పాటు చేశారు. శనివారం ఆ డబ్బాలోని నీటిలో ఏదో కలిసినట్టు గుర్తించిన విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు విజయ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి వివరాలు సేకరించారు. ఉదయం ఏగొండ అనే వ్యక్తి పాఠశాల ఆవరణలో కన్పించినట్టు స్థానికులు తెలుపడంతో అతణ్ణి విచారించారు. రెండు రోజుల క్రితం తన గొర్రెను పాఠశాల సమీపంలోని కుక్కలు చంపేశాయని, వాటిని హతమార్చాలనే నీటిలో విషం కలిపినట్లు అంగీకరించాడు. నీటి నమూనాతోపాటు ఆవరణలో లభించిన విష రసాయనం గల చిన్న సీసాను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని ల్యాబ్‌కు పంపించారు. చిన్నారులకు ప్రమాదం తప్పినందుకు గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి:బాలల హక్కుల సంఘం
సాక్షి, హైదరాబాద్: రెడ్డిపల్లి ఘటన పై ఉన్నతస్థాయి విచారణ జరపాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుతరావు శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రభుత్వవర్గాల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలుస్తోందని ధ్వజమెత్తారు.