
హామీలు హాంఫట్
- 600 వాగ్దానాలు తుంగలోకి...
- ఇదీ చంద్రబాబు ఘనత
- రఘువీరా ఎద్దేవా
అల్లిపురం(విశాఖ): తెలుగుదేశం మేనిఫెస్టోలో పేర్కొన్న 600 హామీలను అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ నగర, జిల్లా కాంగ్రెస్ కమిటీలు సంయుక్తంగా బుధవారం దసపల్లా హోటల్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇదే చంద్రబాబు ఏడాది పాలనలో సాధించిన ఘనత అని, తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానానికి రూ.5 కోట్లు ఎర చూపి నీచ సంస్కృతికి తెరలేపారని విమర్శించారు. హుద్‌హుద్ తుఫానులో కోట్లాది రూపాయల వసూలు చేసి హాంఫట్ చేశారన్నారు. పట్టెసీమ ప్రాజెక్టులో కోట్లాది రూపాయలు అందుకున్నారన్నారు. వీటన్నింటిని దగానాడుకు రూ.100 కోట్లు ఖర్చు చేశారన్నారు. దేశం ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ 8 వతేదీ వరకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహిస్తుందన్నారు.
నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కరరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సేకరించిన 10 లక్షల 25 వేల సంతకాలతో కూడిన పుస్తకాలను ఆయనకు అంద జేశారు. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, వట్టి వసంతకుమార్, పి.బాలరాజు, డి.వి.రామమెహన్, బచ్చు మహేశ్వరరావు, కొండా మురళి, తులసీరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్, పేడాడ రమణకుమారి, కొండా రాజీవ్, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.