మిల్లర్లదే రాజ్యం..!
ధాన్యం బిల్లులకు అడ్డంకులు సృష్టిస్తున్న మిల్లర్లు
వారు కొన్న ధాన్యానికే ఎకనాలెడ్జ్‌మెంట్లు
కొనుగోలు కేంద్రాల ద్వారా పంపిస్తే ఎకనాలెడ్జ్‌మెంట్లు ఇవ్వని వైనం
విజయనగరం కంటోన్మెంట్: ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తాన మిల్లర్లకు అడ్వాన్సు సీఎంఆర్ పేరిట ధాన్యం కొనుగోలుకు కలెక్టర్ అనుమతులిచ్చారో గానీ అప్పటి నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలుపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆ ప్రకారమే ఇంకా ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యానికి ఎకనాలెడ్జ్‌మెంట్లు మిల్లర్లదే రాజ్యం..!
ఇవ్వడం లేదు. దీంతో అస లు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఈ ఏడాది ఆలస్యంగా ప్రారంభించారు. ప్రభుత్వం కొత్త విధానం ప్రకారం ఈ ఏడాది మిల్లర్లంతా వారి మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ఎంత ధాన్యం తీసుకుంటే దాని విలువను డిపాజిట్ గానీ, బ్యాంకు గ్యారెంటీ కానీ ఇవ్వాలని ఉత్తర్వులు విడుదల చేయడంతో మిల్లర్లు బేరసారాలకు దిగారు. చివరకు కలెక్టర్ ఎంఎం నాయక్ కూడా వారి ఒత్తిళ్లకు తలొగ్గి ఒక వంతుకు మూడు రెట్ల ధాన్యం తీసుకెళ్లండని వరాన్నిచ్చారు. అయితే డిపాజిట్లు పూర్తిగా చెల్లించని వారికి అడ్వాన్సు సీఎంఆర్ ఇస్తే డిపాజిట్‌గా ఉంచుకుని దానిపై ధాన్యం ఇస్తామని చెప్పారు. అడ్వాన్సు సీఎంఆర్ ఎలా అంటే మిల్లర్లు కూడా దానికి సరిపడా ధాన్యం కొనుగోలు చేసుకోవచ్చని తేల్చేయడంతో ఇక మిల్లర్ల పంట పండినట్లయింది.
ఇదే అదనుగా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు చేస్తూనే ఉన్నారు. అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం కన్నా మిల్లర్లు బి రిజిస్టర్ ప్రకారం కొనుగోలు చేసిన ధాన్యానికే ఎకనాలెడ్జ్‌మెంట్లు ఇవ్వడంతో వాటికి మాత్రమే చెల్లింపులు అవుతున్నాయి. మరో పక్క ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యానికి మిల్లర్లు ఎకనాలెడ్జ్‌మెంట్లు ఇవ్వకపోవడంతో బిల్లులు అవడం లేదు.
జిల్లా వ్యాప్తంగా సుమారు 4,800 మంది రైతులు బిల్లులకు ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిల్లర్లు తాము కొనుగోలు చేసిన ధాన్యానికి ఎకనాలెడ్జ్‌మెంట్లు ఇచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లిన ధాన్యానికి ఇవ్వడం లేదనీ, అందుకే బిల్లులు నిలిచిపోతున్నాయనీ రైతులు వాపోతున్నారు. మరో పక్క ఇటీవల బిల్లుల చెల్లింపు జాప్యం కూడా ఒక కారణం. ఎటు నుంచి ఎటు వచ్చినా మొత్తంగా రైతులే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
అక్రమానికి ఆనవాళ్లు.. బాడంగి మండలం తెంటు వలసకు చెందిన గుంప సింహాచలమమ్మ గత నెలలో 148 ధాన్యం బస్తాలను డొంకిన వలస కొనుగోలు కేంద్రంలో ఇచ్చింది. ఇందుకు గాను రూ.83,472ల బిల్లు అందాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ బిల్లులు అందలేదు. ప్రతి రోజూ బిల్లుల గూర్చి అడుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
దత్తిరాజేరు మండలం పప్పల లింగాలవలసకు చెందిన పప్పల సత్యం 170 ధాన్యం బస్తాలు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తే ఇప్పటివరకూ బిల్లులు అవలేదు. ఇతనికి రూ.95,880లు బిల్లు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ చేయలేదు.
ఇదే గ్రామానికి చెందిన మోసూరు సత్యనారాయణ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి 150 బస్తాలు విక్రయించారు. ఇతనికి రూ.84,600లు రావాల్సి ఉంది. కానీ నిత్యం తిరుగుతున్నా బిల్లులు రావడం లేదని వాపోతున్నారు.