మన్యంలో భయానక వాతావరణం | Manyanlo horror atmosphere | Sakshi
Sakshi News home page

మన్యంలో భయానక వాతావరణం

Published Sun, Nov 10 2013 1:30 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

Manyanlo horror atmosphere

 

=గొంతుకోసి, గునపాలతో పొడిచి ఇద్దరి హత్య
 =తప్పించుకున్న మరో మాజీ దళసభ్యుడు
 =బలపం సమీపంలో మావోయిస్టుల ఘాతుకం
 =ఇన్‌ఫార్మర్లంటూ సంఘటనా స్థలంలో కరపత్రం
 =మన్యంలో భయానక వాతావరణం
 

మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టులు అతి కిరాతకంగా ఇద్దరిని హతమార్చడంతో ఈస్టు డివిజన్ వణుకుతోంది. చేతులు వెనక్కి కట్టేసి ఒకరిని గొంతుకోసి, మరొకరి మెడపై గునపాలతో పొడిచి చంపడంతో అంతటా భయానక వాతావరణం నెలకొంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన చెరువూరులో 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు వీరే కారణమంటూ, అప్పట్లో పోలీసు ఇన్‌ఫార్మర్లుగా పనిచేయడం వల్లే ఇద్దరిని మట్టుబెట్టినట్టు దళసభ్యులు సంఘటన స్థలంలో విడిచిపెట్టిన కరపత్రంలో పేర్కొన్నారు.
 
చింతపల్లి, న్యూస్‌లైన్: చింతపల్లి మండలం బల పం పంచాయతీ జోహార్ గ్రామ సమీపంలో కిల్లో రాంబాబు, రామ్మోహన్‌లను శుక్రవారం రాత్రి మావోయిస్టులు హత్య చేసిన సంగతి తెలిసిందే. మండలంలోని వేలంజువ్వి గ్రామానికి చెందిన కిల్లో రాంబాబు(25), తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామ్మోహన్(35), జీకే వీధి మండలం బోనంగిపల్లికి చెందిన మాజీ దళసభ్యుడు సంజీ వరావు అలియాస్ వేణులు శుక్రవారం బలపం ప్రాంతానికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా జోహార్ వద్ద మిలీషియా సభ్యులు అడ్డగించారు.

ప్రమాదాన్ని  పసిగట్టిన సంజీవరావు తప్పించుకుని పరారయ్యాడు. రాంబాబు, రామ్మోహన్‌లు చిక్కారు. ఇద్దరినీ రాత్రి 7 గంటల సమయంలో బలపం రహదారి వద్దకు తీసుకొచ్చారు. చేతులు వెనక్కి కట్టేసి ఒకరిని గొంతుకోసి, మరోకరి మెడపై గునపాలతో పొడిచి అతికిరాతకంగా హతమార్చారు. చెరువూరు ఎన్‌కౌంటర్‌కు బాధ్యులయినందునే హతమార్చినట్టు సంఘటనా స్థలంలో విడిచిపెట్టిన కరపత్రంలో పేర్కొన్నారు.

కిల్లో రాంబాబు గతంలో దళసభ్యునిగా పనిచేసి స్వచ్ఛందంగా లొంగిపోయాడు. అనంతరం హోగార్డుగా నర్సీపట్నంలో విధులు చేపట్టాడు. అదే ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకేసులో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి మండల కేంద్రం చింతపల్లి చాడిపేటలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు. హోంగార్డుగా పనిచేసే సమయంలో తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడికి చెందిన రామ్మోహన్‌తో పరిచయం ఏర్పడింది.

ఇద్దరూ కలిసి ఏజెన్సీలో వ్యాపారం చేసేవారు. హోంగార్డుగా చేరినప్పటి నుంచి మావోయిస్టులు రాంబాబుపై దృష్టిపెట్టారు. అదను కోసం ఎదురు చూస్తున్నారు. బలపం ప్రాంతానికి వస్తున్నట్టు సమాచారంతో అతనిని పట్టుకోవాలని, ఆ ప్రాంత మిలీషియా సభ్యులకు ఆదేశించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మిలీషియా సభ్యులు వారిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తగులబెట్టారు. ఇద్దరినీ హతమార్చారు. ఆయా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement