మల్దకల్, న్యూస్‌లైన్: మల్దకల్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం ఆదిశిలా క్షేత్రంలో నేత్ర పర్వంగా కొనసాగింది. మార్గశిర పర్యదినాన్ని పురస్కరించుకుని స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివార్ల కల్యాణోత్సవానికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ తరుఫున మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు. ఆదివారం రాత్రి 12.00గంటలకు లక్ష్మీవేంకటేశ్వరస్వామిల కల్యాణాన్ని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి శ్రీ 1008 విద్యాధీశ తీర్థ శ్రీపాదుల స్వామిజీ వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు. వివిధ మండలాలు, గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
గజ వాహనంపై ఊరేగిన స్వామి వారు
స్థానిక స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని గజ వాహనంపై కూర్చోబెట్టి దశమికట్ట వరకు భాజాభ్రజంతీల నడుమ ఊరేగించారు. అనంతరం ఆలయ ఆవరణలో జ్యోషి అగమయ్య ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని తిలకించేందుకు మహిళలు, భక్తులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కార్యనిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
దైవచింతనతోనే పరిపూర్ణమైన ఆరోగ్యం:
దైవ చింతనతో ప్రజలు పరిపూర్ణమైన ఆరోగ్య జీవితం గడపవచ్చునని ఉడిపి పలిమారు మఠం పీఠాధిపతి విద్యాధీశతీర్థ శ్రీపాదులు తెలిపారు. వెంకటేశ్వరస్వామి పల్లకి సేవకు ఆయన హాజరయ్యారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ గురురాజులు, మండల నాయకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ ఆవరణలో భక్తులనుద్దేశించి ప్రసంగించారు. ప్రజలు రోజూ కొన్ని నియమ నిబంధనలు పాటిస్తుంటే పరిపూర్ణమైన ఆరోగ్య జీవితం గడపవచ్చన్నారు. సత్యం, ధర్మంతో కూడిన పనులు చేయాలన్నాయి. పోయిన డబ్బు, భూమి సంపాదించుకోవచ్చని, గడిచిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేమని చెప్పారు. కార్యక్రమంలో గద్వాల మార్కెట్ యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రంసింహారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మాణిక్యరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రంగస్వామినాయుడు, నాయకులు సీతారాంరెడ్డి, పటేల్ ప్రభాకర్ తదిరతులు పాల్గొన్నారు.
కల్యాణం..కమనీయం
Published Mon, Dec 16 2013 3:00 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
Advertisement