
కర్నూలు(ఆర్‌యూ): రాయలసీమ యూనివర్సిటీలో పీజీ సెమిస్టర్ పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతనెల 21 నుంచి వర్సిటీ ప్రాంగణంలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మాస్ కాపీయింగ్ విషయంలో అధ్యాపకులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంతో విద్యార్థులు మరింత రెచ్చిపోతున్నట్లు సమాచారం. కొందరు విద్యార్థులు ఏకంగా సెల్‌ఫోన్లు వెంట తెచ్చుకుని కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మంగళవారం నుంచి పరీక్షల పరిశీలకులను నియమించారు. అయినా కాపీయింగ్ జోరుకు అడ్డుకట్ట పడలేదని సమాచారం. కొందరు విద్యార్థులు కాపీయింగ్ చేస్తూ పట్టుబడినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ విభాగం పరీక్షల్లో ఓ విద్యార్థి తనకు కేటాయించిన స్థానంలో కాకుండా మరొకరి స్థానంలో కూర్చొని పరీక్ష రాసినట్లు సమాచారం. ఈ విషయంలో విద్యార్థికి ఇన్విజిలేటర్‌కు మధ్య గొడవ జరగ్గా చివరకు అధికారులు ఇన్విజిలేటర్‌నే మార్చినట్లు తెలిసింది. పరీక్షలను వర్సిటీ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మాస్‌కాపీయింగ్‌పై వివరణ కోరగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment