తెగ తాగేస్తున్నారు! | Massive increase in beer sales compared to last year | Sakshi
Sakshi News home page

తెగ తాగేస్తున్నారు!

Published Mon, Apr 4 2016 4:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM

తెగ తాగేస్తున్నారు!

తెగ తాగేస్తున్నారు!

గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బీరు విక్రయాలు
వేసవిలో చల్లదనం కోసం అధికంగా
బీరునే సేవిస్తున్న మద్యం ప్రియులు
విక్రయాల్లో ఏకంగా 54 శాతం పెరుగుదల..
ఏప్రిల్ , మేలో మరింత పెరిగే అవకాశం
డిమాండ్ నేపథ్యంలో అధిక ధర వసూలు చేస్తున్న వ్యాపారులు


గత ఏడాది మార్చిలో బీరు అమ్మకాలు : 97 వేల కేసులు
ఈ ఏడాది మార్చిలో అమ్మకాలు: 1.50 లక్షల కేసులు
 పెరిగిన అమ్మకాల శాతం :        54
బీరు అమ్మకాల ద్వారా ఒక నెలలో ఎక్సైజ్ శాఖకు   అదనపు ఆదాయం: రూ.59 లక్షలు

(సాక్షిప్రతినిధి, అనంతపురం)  అసలే వేసవి. ఆపై ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సాధారణ ప్రజలు మజ్జిగ, నన్నారి, కొబ్బరినీళ్లు, తాటిముంజలు, పుచ్చకాయలు వంటివి తీసుకుంటుంటే..మద్యం ప్రియులు మాత్రం బీరు బాటిళ్లను ఖాళీ చేసేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి బీరు అమ్మకాలు ఏకంగా 54 శాతం పెరిగాయి. దీన్నిబట్టే ‘అనంత’లో బీరు జోరు ఏస్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 238 మద్యం దుకాణాలు ఉన్నాయి. బార్‌అండ్ రెస్టారెంట్లు తొమ్మిది
 
 ఉన్నాయి. వీటిలో 2015 మార్చిలో 97 వేల బీరు కేసులను విక్రయించారు. ఈ ఏడాది 1.50 లక్షల కేసులు అమ్మారు. అంటే 53వేల కేసులు అధికంగా విక్రయించారు. బీరు అమ్మకాల అమాంతం పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కూడా భారీ ఆదాయం వస్తోంది. బీరు బాటిల్ ధర రూ.110. గతేడాది మార్చిలో బీరు అమ్మకాల ద్వారా రూ.1.06 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.1.65 కోట్లు వచ్చింది. అంటే ఒక నెలలోనే కేవలం బీరు అమ్మకాల ద్వారా రూ.59 లక్షల అదనపు ఆదాయం చేకూరింది. ఈ నెలతో పాటు మేలో కూడా ఎండతీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముంది.  దీంతో బీరు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
 
 బాటిల్‌పై రూ.10 పెంచి విక్రయాలు
 బీరుకు డిమాండ్ పెరగడంతో మద్యం వ్యాపారులు బాటిల్‌పై రూ.10 పెంచి రూ.120కి విక్రయిస్తున్నారు. దాబాల్లో దీని ధర మరింత ఎక్కువగా ఉంది.‘అనంత’తో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో దాబాలు అధికంగా ఉన్నాయి. వీటిలో మరో రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు.  బీరు అమ్మకాలు ఓవైపు జోరందుకుంటుంటే ఐఎంఎల్( ఇండియన్ మేడ్ లిక్కర్) అమ్మకాలు మాత్రం తగ్గాయి.  2015 మార్చిలో 1.40 లక్షల కేసుల మద్యం విక్రయిస్తే, ఈసారి 1.43 లక్షల కేసులు విక్రయించారు. మూడు వేల కేసులు మాత్రమే పెరిగాయి. బీరు విక్రయాలతో పోలిస్తే ఇది పెద్ద పెరుగుదల కాదు.
 
 బీరు తాగినా ప్రమాదమే
 బీరైనా, లిక్కరైనా ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే లిక్కర్‌తో పోలిస్తే బీరులో ఆల్కహాల్ శాతం తక్కువ. వేసవిలో బీరు మంచిదనుకోవడం పొరపాటు. అధికంగా బీరు సేవిస్తే లివర్ దెబ్బతింటుంది. నరాల బలహీనత వస్తుంది. మనిషిలో సత్తువ తగ్గుతుంది. కాబట్టి బీరైనా, లిక్కరైనా మద్యానికి దూరంగా ఉండటమే మంచిది.
 - డాక్టర్ వైవీ రావు, ఆర్‌ఎంఓ, సర్వజనాస్పత్రి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement