
సాక్షి, విజయవాడ: దేశంలో అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ కోరిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించారని తెలిపారు. రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో అవే అంశాలను ప్రధాని మోదీ చెప్పారని మంత్రి అన్నారు. ఈ నెల 22 నుంచి ఎంఎస్‌ఎంఈలకు చెల్లింపులు చేస్తామని తెలిపారు. ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ వివరించారని ఆయన చెప్పారు. పరిశ్రామిక ప్యాకేజీ కావాలని ప్రధానికి లేఖ కూడా రాశారని ఆయన గుర్తుచేశారు. రెవెన్యూ లోటుని కూడా భర్తీ చేయాలని గతంలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. (ఎల్‌జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ తరలింపు)
ఎంఎస్ఎంఈ, వ్యవసాయ రంగాలకు కేంద్రం సాయం చేస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం జగన్ ఎంత వాస్తవికంగా ఆలోచిస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. దానివల్ల కార్మికులు, ప్రజల్లో నమ్మకం కలిగిందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ప్రారంభమవుతున్నాయని మంత్రి చెప్పారు. క్రమంగా ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టామని గౌతమ్‌రెడ్డి చెప్పారు.