
సాక్షి, ఆవనిగడ్డ(కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్, డిఐజి ఏఎస్ ఖాన్‌లు అతిథులుగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి మేకతోటి సుచరితకు అధికారుల సమక్షంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయల కల్పన కోసమే మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సమస్యలను పరిష్కరించడానికి ' మహిళా క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో 'మహిళా మిత్ర' పేరిట ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా తెలపడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులు బందోబస్తుకు వెళ్లినపుడు వారికి కనీస అవసరాలు తీర్చేందుకు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి రహితంగా ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని సుచరిత పిలుపునిచ్చారు.