
నెక్లెస్‌రోడ్డులో వెంకటస్వామి స్మారకం
- హెచ్‌ఎండీఏను ఆదేశించిన సీఎం
- కేసీఆర్‌తో మాజీ ఎంపీ వివేక్ భేటీ
సాక్షి,హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామిని భావితరాలు స్మరించుకునేలా రాజధానిలో స్మారక నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆయన దేశానికి సేవచేసిన దళిత నాయకుడిగా, పేదల కోసం జీవించిన ఉన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారని సీఎం అన్నారు. ఆయన గౌరవాన్ని పెంచే విధంగా స్మారకాన్ని నిర్మిస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ జి.వివేక్ కలిసిన సందర్భంగా ఈ అంశంపై అధికారులతో సీఎం మాట్లాడారు.
నెక్లెస్‌రోడ్డులో స్థలం సేకరించాలని, సభలు నిర్వహించుకోడానికి వీలుగా నిర్మాణం ఉండాలని, అందులో వెంకటస్వామి విగ్రహం కూడా ఉండాలని సీఎం ఆదేశించారు. నిర్మాణ బాధ్యతలను హెచ్‌ఎండీఏకు అప్పగించారు. వచ్చే జయంతిని ఇందులోనే నిర్వహించేలా త్వరగా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. తెలంగాణలో భాగ్యరెడ్డి వర్మ కూడా దళితుల కోసం ఎంతో పాటుపడ్డారని, ఆయన చరిత్ర కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంకటస్వామి విషయంలో అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరిక ఊహాగానాలే: వివేక్
టీఆర్‌ఎస్‌లో చేరి వరంగల్ ఎంపీ సీటుకు జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఊహాగానాలేనని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఒకవేళ ఆ ప్రతిపాదన వస్తే టీఆర్‌ఎస్‌లో చేరతారా అన్న ప్రశ్నకు బదులివ్వకుండా ముందుకుసాగారు.