మా పొట్ట కొట్టారు!
- మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల ఆవేదన
- కలెక్టర్‌కు విన్నవించుకున్నా ఫలితం శూన్యం
సాంబమూర్తినగర్ (కాకినాడ) : సుమారు 15 ఏళ్లుగా పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించిన తమను నట్టేట ముంచారంటూ పథక నిర్వాహకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు గురువారం కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ 2002లో అప్పటి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించే బాధ్యతను తమకు అప్పగించిందన్నారు. బిల్లులు సక్రమంగా రాకపోయినా ఎన్నో కష్టనష్టాలు పడి విద్యార్థులకు భోజనం అందించామన్నారు. అయితే అక్షయ పాత్ర పేరుతో తమ పొట్టకొట్టే ప్రయత్నంలో జిల్లా యంత్రాంగం ఉందని ఆరోపించారు.
ఆగస్టు ఒకటో తేదీ నుంచి అక్షయ పాత్ర వారే విద్యార్థులకు భోజనం అందిస్తారని, తమను విరమించుకోవాలని సూచించారని వాపోయారు. సిటీ ఎమ్మెల్యే కొండబాబును ఆశ్రయించగా ఆయన తమను నాలుగు రోజులు తన ఇంటి చుట్టూ తిప్పించుకుని తానేమీ చేయలేనని, కలెక్టర్‌ను కలవాల్సిందిగా సూచించారన్నారు. కాకినాడ నగరంలో సుమారు 200 మంది నిర్వాహకులు, కార్మికులు మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరంతా రోడ్డున పడే ప్రమాదముందన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విషయాన్ని కలెక్టర్ అరుణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.