ఆధార్ హడావుడి అంతాఇంతా కాదు. సంక్షేమ పథకాలన్నింటికీ దీనితో ముడిపెట్టడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజానీకం అన్ని పనులు వదులుకుని రోడ్డున పడ్డారు. సరైన ఏర్పాట్లు చేపట్టకపోవడంతో లక్షలాది మంది ఆధార్ కార్డులు పొందేందుకు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం.
సాక్షి, కర్నూలు: సంక్షేమ పథకాల లబ్ధిదారులు.. తెల్ల రేషన్‌కార్డుదారులు.. వంట గ్యాస్ వినియోగదారులు.. అందరికీ ఆధార్ సమస్యే. వచ్చే నెల నుంచి అన్నింటికీ ఆధార్‌ను తప్పనిసరి చేయడం ముప్పుతిప్పలు పెడుతోంది. నమోదు ప్రక్రియ ఓ పట్టాన కొలిక్కి రాకపోవడం సమస్యలకు కారణమవుతోంది. వేగవంతం చేసేందుకు వందకు పైగా శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా పురోగతి కరువైంది. ఆధార్ అనుసంధాన(సీడింగ్) ప్రక్రియ కూడా అధ్వానంగా మారింది.
ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికార యంత్రాంగం కసర్తు చేస్తున్నా ఆశించిన ఫలితాలు లేకపోవడం గమనార్హం. సామాజిక భద్రతా పింఛన్లకు సంబంధించిన ఆధార్ సీడింగ్ ప్రక్రియలోనూ ఇదే తరహా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా పథకాలను లబ్ధిదారులకు ఎలా వర్థింపజేయాలో తెలియక అధికారులు తికమకపడుతున్నారు. వచ్చే నెల నుంచి జిల్లాలో సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేశారు. అయితే ఆలోపు ఆధార్ ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాలేవీ పట్టించుకోకుండా అధికారులు ఆధార్ విషయంలో ముందడుగు వేస్తుండటం తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. జిల్లాలో 5,54,724 వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా.. 4,35,424 మంది నుంచి
నగదు బదిలీ శాపమే
నేను ప్రైవేట్ సంస్థలో గుమాస్తాగా పనిచేస్తున్నా. అమ్మానాన్నలతో పాటు భార్యను పోషిస్తున్నాను. నెలకు వచ్చే రూ.4వేలతో ఇంటి బాడుగ, కుటుంబ ఖర్చులు పోగా.. గ్యాస్ సిలిండర్‌కు రూ.1370 చెల్లించాలంటే ఎలా సాధ్యం. నగదు బదిలీ పథకం మాలాంటి వారికి శాపమనే చెప్పాలి. పైగా డెలివరీ సమయంలో సిలిండర్‌పై రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు.
- రవికుమార్, కోవెలకుంట్ల
ఆధార్ వివరాలు సేకరించారు. ఇందులో సుమారు 3,90,075 కనెక్షన్లకు ఎల్‌పీజీ సీడింగ్ పూర్తయింది. వీరంతా తమ ఆధార్ సంఖ్యలను సంబంధిత గ్యాస్ డీలర్లకు సమర్పించారు. వీరిలో 3,52,840 కనెక్షన్లకు బ్యాంకు సీడింగ్ పూర్తయింది. ఎల్‌పీజీ సీడింగ్ చేయించుకున్న వారంతా బ్యాంకు సీడింగ్ కూడా చేయించుకుంటేనే రాయితీ వర్తించనుంది. జిల్లా అధికారులు 57 శాతం ఎల్‌పీజీ సీడింగ్ పూర్తయినట్లు గొప్పగా చెబుతున్నా.. బ్యాంకు సీడింగ్ ఎందుకు తక్కువగా ఉందానే విషయంపై దృష్టి సారించడం లేదు. తాజాగా పెరిగిన ధరతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.444లు. సీడిండ్ సక్రమంగా జరిగిన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.926 రాయితీ జమ అవుతుంది. లేకపోతే పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంది. జిల్లా అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇప్పటికీ 1,19,299 వంటగ్యాస్ వినియోగదారులకు ఆధార్ లేదని తెలుస్తోంది. మరో 2,01,884 మందికి ఆధార్ ఉన్నా.. బ్యాంకు సీడింగ్ జరగలేదు. ఈ లెక్కన ఫిబ్రవరి నెలలో 3,21,183 మంది వినియోగదారులు వంట గ్యాస్ రాయితీకి దూరం కానున్నారు. ఆధార్-బ్యాంక్ సీడింగ్ పూర్తయ్యే వరకు వీరంతా పూర్తి మొత్తం చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఫలితంగా వీరిపై నెలకు రూ.44 కోట్ల భారం పడనుంది.
జిల్లాలో 55 శాశ్వత ఆధార్ సెంటర్లు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : జిల్లాలో 55 శాశ్వత ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు చర్యలు చేపట్టారు. అన్ని ప్రభుత్వ పథకాల అమలుకు ఆధార్‌ను అనుసంధానం చేస్తుండటంతో ఆధార్ నమోదు శాశ్వత కేంద్రాలు అవసరమయ్యాయి. ఆధార్ నమోదు కార్యక్రమం నిరంతర ప్రక్రియగా మారడంతో మీ-సేవ కేంద్రాల్లోనే శాశ్వత ఆధార్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. మీ-సేవ కేంద్రాలలో ఆధార్ నమోదు ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. గ్యాస్ వినియోగదారులు, స్కాలర్‌షిప్ విద్యార్థులు, రేషన్ కార్డులను ఆధార్‌తో నమోదు చేయడంలో జేసీ తీసుకున్న చొరవతో జిల్లా ప్రగతి పథంలో ఉంది.
ఫిబ్రవరి 15లోగా వివరాలివ్వండి: కె.కన్నబాబు, జేసీ
జిల్లాలో నగదు బదిలీ పథకం ఫిబ్రవరి నుంచి మొదలుకానుంది. ఫిబ్రవరి 15వ తేదీలోపు గ్యాస్ వినియోగదారులు డీలర్లకు ఆధార్ వివరాలను అందజేయాలి. లేకపోతే నగదు బదిలీ వర్తించదు. ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోని వారి కోసం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున శాశ్వత ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రేషన్‌కార్డుల అనుసంధాన ప్రక్రియ నెమ్మదిగానే సాగుతోంది. ఎల్‌పీజీ గ్యాస్ డీలర్ల ద్వారా వినియోగదారుల వివరాలను సేకరించి.. ఎల్‌డీఎం ద్వారా బ్యాంకర్లకు అందజేస్తాం.
పేదోడిపై భారం: మహదేవరావు, కోవెలకుంట్ల
సైకిల్‌పై ఉరూరూ తిరుగుతూ బట్టల వ్యాపారం చేస్తున్నా. వచ్చే అరకొర సంపాదనతో తల్లి, భార్య, కుమార్తెను పోషిస్తున్నా. కూతురు టీటీసీ చదువుతోంది. ఇప్పటికీ కష్టంగా బతుకు బండి లాగిస్తున్నా. ఈ పరిస్థితుల్లో సిలిండర్‌కు ముందుగానే రూ.1370 చెల్లించాలంటే కష్టమవుతోంది. ఆధార్‌తో పేదల బతుకు మరింత దుర్భరం అవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి.
ముప్పుతిప్పలు
Published Wed, Jan 29 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 AM
Advertisement
Advertisement