మధ్యంతర ఎన్నికలు తథ్యం
కొయ్యలగూడెం :రాష్ట్రంలో టీడీపీ సర్కారు ఐదేళ్లూ పాలనను కొనసాగించడం అసంభవమని, ఏ క్షణంలోనైనా మధ్యం తర ఎన్నికలు రావడం తథ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని స్పష్టం చేశారు. శనివారం కొయ్యల గూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలతో ప్రజలు విసిగిపోయారని, త్వరలోనే వారినుంచి తిరుగుబాటు వస్తుందని నాని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం ఆయన విధానాలపై విసుగు చెందారని, గత్యంతరం లేక ఆయన మాటలకు వంత పాడుతున్నారని అన్నారు. టీడీపీ శ్రేణులకు ప్రజల మధ్యకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, వైఎస్సార్ సీపీ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమ బాట పడుతోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు రాజధాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని, తన కోటరీతో కోట్లాది రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఆయనకు కాంగ్రెస్ నాయకులు పరోక్షంగా సహకరిస్తున్నారని విమర్శించారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్, మలేషియా అంటూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్విని యోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనకు అంతిమ ఘడియలు సమీపించాయని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని నేతృత్వంలో జిల్లాలోని 15 స్థానాల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇతర పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలోకి చేరికల పరంపర ప్రారంభమైందని, టీడీపీ నుంచి కూడా వలసలు మొదలవుతున్నాయని బాలరాజు అన్నారు. 300 వాగ్దానాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీలో చేరిన నాయకులు
ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యువజన కాంగ్రెస్ నాయకుడు దుగ్గిన శ్రీనివాస్, ఆయన అనుచరులకు ఆళ్ల నాని, బాలరాజు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముందుగా మెయిన్ సెంటర్‌లో పార్టీ సీనియర్ నాయకులు తాడికొండ మురళీకృష్ణ, మట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాని, బాలరాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మనెల్లి నాగేశ్వరరావు మృతికి సమావేశం నివాళులుఅర్పించింది. అనంతరం జిల్లా సర్పంచ్‌ల ఛాంబర్ ఉపాధ్యక్షులు దేవీ గంజిమాల నివాసానికి వెళ్లి ఇటీవల ఆమె ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆరా తీశారు.
తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు పోల్నాటి బాబ్జి, ముప్పిడి సంపత్‌కుమార్, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాలపద్మ, సీనియర్ నాయకులు తాడికొండ మురళీకృష్ణ, ఎండీ హాజీ బాషా, దాసరి విష్ణు, గాడిచర్ల సోమేశ్వరరావు, చిన్నం గంగాధరం, నాయకులు గోపాలకృష్ణ గోఖలే, తుమ్మలపల్లి గంగరాజు, తాడిగడప రామకృష్ణ, ఎస్‌కే బాజీ, దూలపల్లి కాంతారావు, చిన్నం గంగాధరం, కాపర్తివేణు, బుట్టాయగూడెం మండల కన్వీనర్ సయ్యద్‌బాజీ, పార్టీ జిల్లా నాయకులు ఆరేటి సత్యనారాయణ, సంకు కొండ, యడ్లపల్లి సురేష్, చిక్కాల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.