మిల్లర్లు.. బకాసురులు | Miller .. bakasurulu | Sakshi
Sakshi News home page

మిల్లర్లు.. బకాసురులు

Published Thu, Nov 6 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

Miller .. bakasurulu

కర్నూలు:
 పేదల బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారుతోంది. అధికారుల నిఘా వైఫల్యం రైస్ మిల్లర్లకు వరమవుతోంది. కర్నూలు, ఆదోని కేంద్రంగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతోంది. నగరంలోని హనుమాన్ వేబ్రిడ్జి సమీపంలో.. రేడియో స్టేషన్ పక్కన.. బళ్లారి రోడ్డులోని ఎస్‌ఆర్‌ఎంటీ వద్ద.. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని రెండు రైస్ మిల్లుల్లో ఈ తరహా వ్యాపారం నిత్యకృత్యం. ఆదోనిలోని పలు మిల్లుల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లా నలుమూలల నుంచి బియ్యాన్ని సేకరించి రైస్ మిల్లుల్లో పాలిష్ చేసి ఆకట్టుకునే ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి కర్ణాటక, మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

రంగు మారి తెల్లగా కనిపించేలా మిల్టెక్ అనే యంత్రంతో పాలిష్ చేస్తున్నారు. డీలర్లు, మధ్య దళారులు క్వింటా రూ.1200 నుంచి రూ.1500లకు కొనుగోలు చేస్తూ.. పాలిష్ చేసిన బియ్యాన్ని సన్న బియ్యంలో 20 నుంచి 40 శాతం కలిపి విక్రయిస్తున్నారు. క్వింటా రేషన్ బియ్యం పాలిష్ చేస్తే 20 శాతం తరుగు పోతోంది. జిల్లాలో 11.54 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా 11.5వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పంపిణీ అవుతోంది. ఇందులో సగానికి పైగా అడ్డదారుల్లో రైస్ మిల్లులకు తరలుతోంది.

రూపు మార్చుకొని మళ్లీ ఎక్కువ ధరతో వినియోగదారులకు చేరుతోంది. బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై అధికారుల నిఘా కొరవడటంతో రైస్ మిల్లుల యజమానులు తమ దందా నిర్భయంగా సాగిస్తున్నారు. భారీ మొత్తంలో రేషన్ బియ్యం నిల చేసుకుని రాత్రిళ్లు పాలిష్ చేసి తెల్లారేలోగా గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ప్రతి నెలా 5.50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోందని ఓ జిల్లా అధికారే స్వయంగా చెప్పడం ఈ దందా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది.

రైస్ మిల్లులను తరచూ పౌర సరఫరాల శాఖ, ఆర్డీఓ స్థాయి అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని అడ్డగోలుగా సేకరిస్తూ రైస్ మిల్లర్లు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ మామూళ్లకు అలవడిన అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. కర్నూలు నగరంలోనే కనీసం 50 మందికి పైగా మధ్య దళారులు డీలర్లు, కార్డుదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు చేరవేస్తున్నారు. జిల్లాలో 17 బియ్యం గోదాములు ఉండగా.. ప్రతి నెలా మొదటి వారంలో ఆయా గోదాముల వద్ద బియ్యం వ్యాపారులు తిష్ట వేసి గోడౌన్ ఇన్‌చార్జీలతో చేతులు కలిపి తమ పబ్బం గడుపుకుంటున్నారు.

 కేసులు నీరుగారుస్తున్న అధికారులు
 పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. నెలలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే కార్డుదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసి దుకాణాలను మూసేస్తున్నా ఇదేమని ప్రశ్నించని పరిస్థితి. అడపాదడపా మొక్కుబడి దాడులు చేస్తున్నా.. పీడీ యాక్టు అమలు చేయాల్సిన కేసులనూ 6ఏ తరహా సాధారణ కేసులు నమోదు చేసి ఆ తర్వాత నీరుగారుస్తున్నారు. వాహన డ్రైవర్లతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించి కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 2013 జులై నుంచి 2014 జులై వరకు 100 పైగా 6ఏ కేసులు నమోదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
 
 గత నాలుగు నెలల్లో
 అక్రమ తరలింపు ఇలా...

     యాగంటిపల్లె వద్ద 500 క్వింటాళ్ల బియ్యం.. ప్యాపిలి వద్ద 223 క్వింటాళ్లు.. బనగానపల్లెలో 225 క్వింటాళ్ల.. అనంతపురంలో లారీ బియ్యం.. ఇదంతా గత నాలుగు నెలల్లో బనగానపల్లె పట్టణానికి చెందిన ఓ రైస్ మిల్లర్ కర్ణాటక రాష్ట్రంలోని బాచేపల్లికి తరలిస్తుండగా పట్టుబడింది.

     గత అక్టోబర్ రెండో వారంలో కర్నూలులోని పాతబస్తీకి చెందిన డీలర్ 20 క్వింటాళ్ల బియ్యం ఆటోలో తరలిస్తుండగా సీపీఎం కార్యకర్తలు పట్టుకుని అధికారులకు అప్పగించారు.

     అదే నెల 9న కోడుమూరులోని చౌరెడ్డి కాంప్లెక్స్ గోడౌన్‌లో నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

     15న కర్నూలు నగరం బుధవారపేటలో ఓ డీలర్ 30 క్వింటాళ్ల బియ్యాన్ని ఆటోలో తరలిస్తుండగా ఏఐవైఎఫ్ కార్యకర్తలు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అప్పగించారు.

     17న నందికొట్కూరు నుంచి కర్నూలుకు లారీలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని లెక్చరర్స్ కాలనీ వద్ద అర్ధరాత్రి గస్తీ విధుల్లోని పోలీసులు పట్టుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement