
మెస్ నిధులు మింగేశారు!
- కోనాం ఆశ్రమ పాఠశాలలపై ఏసీబీ దాడులు
- రెండు పాఠశాలలో అవకతవకలు ఉన్నట్లు గుర్తింపు
- రికార్డులు స్వాధీనం
- లేని విద్యార్థుల పేరిట మెస్ నిధులు స్వాహా
- ఆయా శాఖలకు ఫిర్యాదు చేస్తాం: డీఎస్‌పి ప్రకటన
చీడికాడ, న్యూస్‌లైన్: మండలంలోని కోనాంలో గల గిరిజన బాలుర ఆశ్రమోన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు జరిపారు. రికార్డుల్లో పలు అవకవకలు గుర్తించారు. ఉదయం 9.15 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు రెండు బృందాలుగా దాడులు చేపట్టారు. ఏసీబీ డిఎస్‌పి ఎం.నర్సింహారావు ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో రెండు పాఠశాలల్లో అవకతవకలు బయటపడ్డాయి. దీనిపై డీఎస్‌పీ నర్సింహారావు విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేపట్టినట్లు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.
గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో రికార్డుల పరంగా 189 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా బుధవారం రాత్రి 168 మంది ఉన్నట్లు మెస్ రికార్డుల్లో వార్డెన్ దేముడబ్బాయి నమోదు చేశారన్నారు. అయితే గురువారం ఉదయం తనిఖీల్లో 53 మందే ఉన్నట్లు గుర్తించామని, రోజుకు 115 మంది పేరిట మెస్ చార్జిల నిధులు కాజేస్తున్నట్లు గుర్తించామన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో రికార్డులు పరంగా 439 మంది విద్యార్థినులు ఉండాగా బుధవారం రాత్రి 431 మంది ఉన్నట్లు మెస్ రికార్డుల్లో నమోదు చేసుందని, అయితే తమ తనిఖీల్లో 409 మందే విద్యార్థులు మాత్రమే ఉన్నట్టు గుర్తించామని తెలిపారు.
ఇక్కడ 22 మంది విద్యార్థుల పేరిట ప్రిన్సిపాల్ శ్రీదేవి, వార్డెన్ రామలక్ష్మి మెస్ ఛార్జిలు కాజేస్తున్నట్టు గుర్తించామని అన్నారు. సంబంధిత రికార్డులను సీజ్ చేసి వీరిపై ఆయా శాఖలకు ఫిర్యాదులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.