సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్ ప్రభావం విద్యా సంస్థలపై ఎక్కువగా ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 90 లక్షల విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. 10వ తరగతి పరీక్షలు లాక్‌డౌన్ తరువాత నిర్వహిస్తామని, ఇందుకోసం వారికి ఆన్‌లైన్ క్లాసులు చెప్పిస్తున్నామని తెలిపారు. దూరదర్శన్ ద్వారా ఈ క్లాసులకు 5 లక్షల మంది హాజరవుతున్నారని చెప్పారు. నేటి నుంచి ఎఫ్‌ఎం, రేడియో ద్వారా కూడా క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ('సిలబస్‌ను ఆన్‌లైన్‌లో పూర్తి చేయండి')
విద్యార్థులందరికి జగనన్న గోరుముద్దను ఇంటింటికీ అందించామన్నారు. ఇక అన్ని యూనివర్శిటీల్లోని మిగిలిన సిలబస్‌ను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లో యూనివర్శిటీలకు విద్యార్థులు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారని, అందుకే మన రాష్ట్రంలో వారికి విద్యావకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతేగాక యూనివర్శిటీల మిడ్ ఎగ్జామ్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇక వచ్చే విద్యా సంవత్సరంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడు నష్టపోయిన రోజులను తరువాత ఏడాది సెలవు రోజులను కుదించి అదనంగా క్లాసులు నిర్వహించి కవర్ చేస్తామని పేర్కొన్నారు. కాగా అన్ని ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా వేశామని చెప్పారు. ఆన్‌లైన్‌లోనే గేట్ కోచింగ్‌ను కూడా ఇవ్వాలని నిర్ణయించామని, విద్యార్థులు ఎవరూ ఖాళీగా ఉండకుండా ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. (క్వారంటైన్ రుణం తీర్చుకున్నారు.. ఇలా!)
Comments
Please login to add a commentAdd a comment