ఇదీ వుడా దారి!
మంత్రి కుమారుని రిసెప్షన్ కోసం ఏయూలో రోడ్డు నిర్మాణం
కి.మీ మరమ్మతులకు రూ. 1.6 కోట్లు ఖర్చు
ఆ మొత్తం ‘ఫ్లీట్’ లెక్కల్లో జమ
మంత్రుల అనుచరులకే కాంట్రాక్ట్
హడావుడిగా పనులు, నాణ్యతాలోపం
విశాఖపట్నం సిటీ: ఇద్దరు మంత్రుల మెప్పు కోసం వుడా అధికారులు నిబంధనలకు పాతరేశారు. తమ కు ఎలాంటి సంబంధం లేని నగరంలో ఏ కంగా రోడ్డు నిర్మించేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించాల్సిన వుడా అధికారులు మంత్రుల ప్రాపకం కోసం ప్రజాధనాన్ని రోడ్డు పాల్జేశారు. ఆ రోడ్డు నిర్మాణమైనా నాణ్యతతో కూడికున్నదా అంటే అదీ లేదు. టెండర్లు పిలిచిన దగ్గర్నుంచీ మంత్రుల కనుసన్నల్లోని వ్యక్తులకే ఆ పనులను కట్టబెట్టి హడావుడిగా పని కానిచ్చేశారు. ఏ మాత్రం నాణ్యత లేకుండా గతంలో ఉన్న రోడ్డుపైనే ఓ రెండు అంగుళాలు పెంచి తూతూమంత్రంగా అయ్యిందనిపించారు. రాత్రీ పగలూ తేడా లేకుండా రోడ్డు, కల్వర్టులు, మార్జిన్‌లు నిర్మిస్తున్నారు. ఒక పక్క కల్వర్టులు నిర్మిస్తుంటే మరో పక్క సున్నాలు వేసుకుంటూ పని అయ్యిందనిపించేస్తున్నారు. ఇంత అర్జంటుగా పని చేసేస్తున్నారేంటా అని ఆరా తీస్తే ఈ నెల 4వ తేదీన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ మైదానంలో ఇద్దరు రాష్ట్ర మంత్రుల పిల్లల వివాహ రిసెప్షన్ ఉంది. దీని కోసం ఇంత ఆదరబాదరాగా చేస్తున్నామని అధికారులు సెలవిస్తున్నారు.
ఏయూ పరిధిలో వుడా రోడ్డా!
నగరంలోని మద్దిలపాలెం జంక్షన్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డులో నాలుగు రోజుల క్రితం రోడ్డు నిర్మించారు. రూ. 1.6 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రెండేళ్ల కిందట ఇక్కడే నిర్వహించిన జిల్లా మంత్రి కుమార్తె వివాహం కోసం కూడా అప్పట్లో జీవీఎంసీ చేత రోడ్డు నిర్మించేసినట్టుగానే ఈ సారి వుడాతో ఈ పని చేయించారు. ఎలాగూ వచ్చే రెండు మాసాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉన్నందున ఆ లెక్కల్లో ఈ లెక్కనూ జత చేసేయమంటూ ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన సలహాకు వుడా అధికారులు సై అన్నారు. మంత్రులు తలచుకుంటే కాదనేది ఉంటుందా అంటూ ప్రతిపాదనలు సిద్ధమైన రెండు వారాల్లోనే అన్ని పనులు కానిచ్చేశారు. వాస్తవానికి ఈ రోడ్డు ఆంధ్రా యూనివర్సిటీది. ఏయూ అధికారులు సమావేశమై ఈ రోడును తాము నిర్మించుకోలేమని జీవీఎంసీకి లేఖ రాస్తే అందుకు జీవీఎంసీ రోడ్డు నిర్మించాల్సి ఉంది. కానీ వుడా రంగ ప్రవేశం చేసి కేవలం ఒక కిలోమీటర్ రోడ్డును వేయడానికి రూ. 1.6 కోట్లు వెచ్చించడం వెనుక మతలబు ఏంటో వారికే తెలియాలి.
అక్రమాలకు తెరతీసిన అధికారులు
వుడాను సమూలంగా మార్పు చేసేశామని ప్రకటినలిస్తున్న అధికారులే ప్రస్తుత అక్రమ దందాలకు తావిస్తున్నారనే అరోపణలున్నాయి. కేవలం రోడ్డు పని పేరిట ఆ కాలేజీ మైదానంలో చేపట్టే అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలని కాంట్రాక్టర్‌కు అప్పగించినట్టు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులకు సంబంధించిన రిసెప్షన్ కావడంతో ఆర్భాటంగా కనిపించేలా ఇంజనీరింగ్ కాలేజీ మైదానాన్ని తీర్చిదిద్దే బాధ్యతను లోపాయికారిగా కాంట్రాక్టర్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇతరులకు ఈ కాంట్రాక్టు ఇస్తే బయటకు పొక్కుతుందని గ్రహించిన వుడా అధికారులు మంత్రులు సూచించిన వ్యక్తులకే ఈ కాంట్రాక్టును అప్పగించి వారి సేవలో తరిస్తున్నారని అధికార పార్టీ నేతలే అంటున్నారు.