సాక్షి, అమరావతి: దేశంలోనే పేరుగాంచిన 11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ ఒప్పందాలు కుదిరాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక అడుగులు వేస్తున్నామన్నారు. ఎంఎస్ స్వామినాథన్, ఐకార్‌తో పాటు మొత్తం 11 సంస్థలతో ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ఈ సంస్థలు వ్యవసాయరంగానికి కావాల్సిన సాంకేతిక సహాయం, సలహాలు ఇస్తాయన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విస్తరణను గ్రామ స్థాయికి తీసుకు వెళ్లాలన్నదే ముఖ్య ఉద్దేశం అన్నారు. అన్ని రైతు భరోసా కేంద్రాలకు ఈ సంస్థల సేవలు అందుతాయని, అదే విధంగా వీరి ద్వారా శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు చెప్పారు. మరో నాలుగేళ్లలో ఆక్వా, బయోఫెస్టిసైడ్ వంటి కీలక విభాగంలోను త్వరలో ఎంవోయూతో ఒప్పందాలు జరగనున్నట్లు తెలిపారు. మున్ముందు ప్రతి పంటకు సలహాల కోసం నిపుణులతో ఒప్పందాలు జరుగుతాయన్నారు. సీఎం జగన్ రైతులకు ఇచ్చే సేవలో నాణ్యత ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి 66 శాతం ఉన్న వ్యవసాయాన్ని వృద్ధి చేయాలని సీఎం జగన్ చెప్పారన్నారు. ఇప్పుడు ఒప్పందం చేసుకున్న సంస్థలు పైలెట్ రీసెర్చ్ చేపడతాయని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 147 అగ్రి ల్యాబ్స్, 13 జిల్లా స్థాయి ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇక కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. మొదటి దశగా 3000 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఈ కేంద్రాల ద్వారా అందిస్తామన్నారు. ఇక ఏపీ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శంకర్ బాబు మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలు దేశంలోనే విప్లవాత్మకమన్నారు. ఏ రాష్ట్రంలో ఇలాంటి ఎంవోయూలు జరగలేదని పేర్కొన్నారు. నాణ్యతపై దృష్టి పెట్టిన ఏకైక ప్రభుత్వం ఇదేనని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment