ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి | Minister Mopidevi Venkata Ramana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

అప్పుల సంస్కృతి టీడీపీదే..

Published Thu, May 28 2020 1:24 PM | Last Updated on Thu, May 28 2020 1:47 PM

Minister Mopidevi Venkata Ramana Comments On Chandrababu - Sakshi

సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆశాజ్యోతిగా మారారని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.40వేల కోట్లకు పైగా ఖర్చుచేశారని తెలిపారు. ‘‘దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థను సీఎం జగన్‌ తీసుకొచ్చారు. దేశానికే ఆదర్శప్రాయ సీఎంగా నిలిచారు. రాష్ట్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని’ ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు..
సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తోన్న సంక్షేమ పాలనను చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని..ఆయనపై విమర్శలు చేసేందుకే మహానాడు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. మహానాడు వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పన్నులు పెంచామని దుష్ప్రచారం చేస్తున్నారని.. టీడీపీ నేతలు దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మోపిదేవి ప్రశ్నించారు. ప్రజాధనాన్ని కొల్లగొట్టే సంస్కృతి చంద్రబాబుదేనని నిప్పులు చెరిగారు. మహానాడులో తీర్మానాలను చూస్తే ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుందన్నారు.(చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే: అవంతి శ్రీనివాస్‌)

చెత్త వార్తలు రాయొద్దు..
రాష్ట్రం దివాళా అంటూ ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. చెత్త వార్తలు రాయొద్దని.. ప్రజలకు పనికొచ్చే వార్తలు రాయాలని ఆయన హితవు పలికారు. రెండున్నర లక్షల కోట్లు చంద్రబాబు అప్పులు చేశారని.. రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టింది ఆయనేనని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రజాక్షేత్రంలో టీడీపీతో చర్చకు సిద్ధమని మంత్రి మోపిదేవి సవాల్‌ విసిరారు. తమతో చర్చించేందుకు సిద్ధమా.. కాదా అనేదానిపై టీడీపీ సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో యూనిట్‌ విద్యుత్‌ ధర 3.5 పైసలు నుంచి 4.85 పైసలకు పెంచుతూ పీపీఏలను చంద్రబాబు కుదుర్చుకున్నారన్నారు. ప్రజలకు తక్కువ ధరకు విద్యుత్‌ ఇచ్చేందుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. (ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్‌)

రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టు పట్టించారు..
కరోనా నియంత్రణకు సీఎం జగన్‌ చర్యలను దేశమంతా మెచ్చుకుందన్నారు. ప్రచార్భాటానికి దూరంగా కరోనాపై చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే టీటీడీ ఆస్తులను అమ్మాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని.. గతంలో జరిగిన వాస్తవాలను సుబ్రహ్మణ్యం స్వామి బయట పెట్టారని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించింది చంద్రబాబేనని.. వాటి గురించి ఆయనకు మాట్లాడే అర్హత లేదన్నారు. కులం,మతం,పార్టీలు చూడకుండా సీఎం జగన్‌ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మోపిదేవి పేర్కొన్నారు.

చంద్రబాబువి నీచరాజకీయాలు
రైతులకు కులాలు అంటగట్టే నీచ రాజకీయానికి చంద్రబాబు పూనుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే రైతుల ముసుగులో టీడీపీ నాయకులతో చంద్రబాబు కేసులు వేయించారని గుర్తు చేశారు. ఎప్పుడెప్పుడు సీఎం పదవి వస్తుందా అంటూ బాలకృష్ణ కలలు కుంటున్నారని.. తన బావను ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా అంటూ మంత్రి ఎద్దేవా చేశారు. రెండేళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బాలకృష్ణ భ్రమలో బతుకుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement