‘మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు’ | Minister Narayana Swamy on Illegal Liquor Sales In Lockdown Period | Sakshi
Sakshi News home page

‘మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు’

Published Tue, Apr 7 2020 3:57 PM | Last Updated on Tue, Apr 7 2020 4:38 PM

Minister Narayana Swamy on Illegal Liquor Sales In Lockdown Period - Sakshi

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ వేళ మద్యం అక్రమ అమ్మకాలపై డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల్లో చెక్‌పోస్ట్‌లలో మరింత నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మద్యం అమ్మకాలకు సహకరిస్తున్న ఎవరినీ కూడా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్‌ను తనిఖీ చేసి, మళ్ళీ అమ్మకాలు ప్రారంభించిన తర్వాత ఓపెనింగ్‌ స్టాక్‌కు ఇప్పటి క్లోజింగ్‌ స్టాక్‌ సరిగా ఉందో లేదో వెరిఫై చేయాలని ఎక్సైజ్‌ సిబ్బందిని ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేదాన్ని అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వానికి ప్రతి రోజూ కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తున్నా ప్రజారోగ్యం ముఖ్యమనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ మద్యం అమ్మకాలను నిషేధించారని తెలిపారు. అయితే నిబంధనలు అతిక్రమించి కొంతమంది టీడీపీ అనుకూల బార్‌ ఓనర్లు మద్యాన్ని బయటికి తీసుకొచ్చి విపరీతమైన ధరలకు విక్రయిస్తున్న ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపారు. దీంతో వెంటనే ఆ బార్ల లైసెన్స్‌ సస్పెండ్‌ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఇప్పటికే చిత్తూరులో టీడీపీకి చెందిన భాస్కర్‌ నాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో అతని బార్‌ లైసెన్స్‌ సస్పెండ్‌ చేశామని వెల్లడించారు.

మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారమివ్వండి
ఎవరైనా మద్యం విక్రయిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఈ సందర్బంగా మంత్రి నారాయణస్వామి ప్రజలకు సూచించారు. టోల్‌ ఫ్రీ నెంబర్లు 18004254868, 94910 30853, 0866 2843131 ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పోయి హానికర ద్రవాలు సేవించి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. వారి విషయంలో కుటుంబసభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్‌ఫ్రీ నెంబర్లకు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని, ఈ నెంబర్లు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement