- మొక్కుబడిగా అవగాహన సదస్సులు
- కనీసం కరపత్రాలు పంపిణీ చేయని అధికారులు
- స్పెషల్ డివిజన్ కార్యాలయంలో మూలుగుతున్న కరపత్రాలు
సాక్షి, విజయవాడ : భూగర్భ జలాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీరు-చెట్టు పథకం కింద పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా చెరువుల్లో పూడిక తీయడంతో పాటు వర్షపు నీరు వాగులు, వంకల్లోకి ప్రవహింపజేయడం, వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవచ్చో తెలియజేస్తూ లక్షలు రూపాయలు వెచ్చించి వాటర్ షెడ్స్ కరపత్రాలను ముద్రించారు. ఈ కరపత్రాల్లో ఆయా మండలాల్లో వర్షపాతం, వాగులు, చెరువుల వివరాలు, భూగర్భ జలస్థితి, బావులు, బోరుల్లో నీటిమట్టం తదితర సమాచారం ఇచ్చారు.
అలాగే వర్షపు నీటిని ఉయోగించుకుని భూగర్భజలాలను ఎలా పెంచుకోవచ్చో వివరించారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన జలవనరుల సలహామండలి సమావేశంలో ఈ కరపత్రాలను మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు స్వయంగా ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు కరపత్రాలు అందజేయాలని, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలని ఇంజినీర్లుకు సూచించారు.
మండలాలకే చేరని కరపత్రాలు..
లక్షలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు ఇరిగేషన్ ప్రాంగంణంలోని స్పెషల్ డివిజన్ కార్యాలయంలో పడి ఉన్నాయి. ఈ నెల రెండు నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రేపటితో అవగాహన సదస్సులు ముగుస్తుండగా ఇప్పటి వరకు ఒక్క మండలానికి కానీ, గ్రామానికి కానీ ఈ కరపత్రాలు పంపలేదు. రైతులకు ఎంతో ఉపయోగపడే సమాచారానికి సంబంధించిన కరపత్రాలు కార్యాలయంలో పడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల్లో రైతులు భూగర్భ జలాల గురించి సమాచారం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఇరిగేషన్ అధికారులను పరుగులు పెట్టిస్తానంటూ మంత్రి దేవినేని హడావుడి చేస్తుంటే.. మరో వైపు రైతులకు కావాల్సిన సమాచారంతో ముద్రించిన కరపత్రాలను వారికి అందించకుండా మొక్కుబడిగా అవగాహన సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.
తూతూ మంత్రంగా అవగాహన సదస్సులు..
మెట్ట ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న నీరు- చెట్టు అవగాహన సదస్సులను అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. రైతులు వ్యవసాయపనులకు వెళ్లే సమయానికి ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లోకి చేరుకుంటున్నారు. కనీసం పదిమంది రైతులు లేకపోయినప్పటికీ హడావుడిగా సదస్సును నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల నిర్ణీత సమయం కంటే రెండు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. మైలవరం నియోజకవర్గంలో చంద్రాల, చండ్రగూడెం, పొందుగల తదితర గ్రామాల్లోనూ మొక్కుబడిగానే సదస్సులు జరిగాయి.
కేవలం టీడీపీ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించి సమావేశాన్ని ముగిస్తున్నారు. నీరు- చెట్టుపై రైతులకు అవగాహన కల్పించాలంటూ మంత్రి ఇచ్చిన ఆదేశాలు ఆయన సొంత జిల్లాలోనే ఏ మాత్రం అమలు కావడం లేదు. కొన్నిచోట్ల నీరు-చెట్టు కింద జరుగుతున్న సమావేశాలకు హజరవుతున్నప్పటికీ.. రైతులు రుణమాఫీ జరగలేదంటూ అధికారులను నిలదీస్తూ ఉండటంతో వారు అవాక్కవుతున్నారు.