Awareness events
-
కోవిడ్‌పై పోరుకు ప్రజాచైతన్య కార్యక్రమం
న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో అవగాహనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కరోనాను ఓడించడానికి ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ, మంత్రులు కోరారు. రానున్న పండుగల సీజన్, శీతాకాలం, అన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనాందోళన్ పేరుతో ఈ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం ప్రజలే కేంద్రంగా నడుస్తుందని మోదీ అన్నారు. దేశ ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చినప్పుడే కోవిడ్ లాంటి మహమ్మారిపై పోరాడగలుగుతామని హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ‘యునైట్ 2 ఫైట్ కరోనా’హ్యష్‌టాగ్‌తో ఈ వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి మన ప్రయత్నాలను ముమ్మరం చేయాలని మోదీ అన్నారు. -
బోర్లు కాదు.. కందకాలు తవ్వండి
వర్షపు నీటిని ఒడిసిపట్టుకున్నప్పుడే భూగర్భ జలనిధి పెరుగుతుంది ‘సాక్షి’-తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నల్లగొండ: మెట్ట ప్రాంతాలకు చెందిన రైతులు తరి పంటలు పండించేందుకు బోర్లు తవ్వకుండా కాంటూరు కందకాలను తవ్వుకోవాలని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడమే భూగర్భ జలనిధి సంరక్షణకు ఏకైక మార్గమని వారు రైతులకు సూచించారు. ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం వర్షపు నీటి వినియోగంపై జిల్లాలోని పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రం, జిల్లాకేంద్రంలోని డ్వామా కార్యాలయంలో రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి. ఈ సద స్సుల్లో భాగంగా వాటర్షెడ్ల పరిధిలోని రైతాంగానికి ఇరువురు సీనియర్ ఇంజనీర్లు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మేరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు చేసే పని అవి చేసుకుంటూ వెళ్లిపోతాయని, వాటి కోసం ఎదురు చూడకుండా తమ పొలాల్లో పంటలను పండించేందుకు రైతులు స్వయంగా ఏం చేయాలనే దానిపై ఆలోచించాలని కోరారు. ప్రాజెక్టులు కట్టేంత వరకు రైతు జాతి బతికి ఉండాలంటే ప్రతి రైతూ తన పొలంలో కందకాలు తవ్వుకునేందుకు పూనుకోవాలని అన్నారు. బోర్ల జిల్లాగా పేరు పడ్డ నల్లగొండ జిల్లాలో కాగితాలపై ఎన్ని ప్రాజెక్టులున్నా, ఎన్ని వాగులు, వంకలు పారినా రైతుల పంటలకు నీళ్లు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అనేక కారణాలున్నాయని, అయితే ఈ కారణాలను వెతుక్కుంటూ కూర్చోవడం కన్నా తానే తన పొలంలో భూగర్భ జలాలను సంరక్షించుకోవడం ద్వారా వరుసగా రెండేళ్లు కరువు వచ్చినా పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఈ కందకాల తవ్వకం ద్వారా భూగర్భ జలమట్టం పెరిగితే ఫ్లోరోసిస్ పీడ కూడా విరగడవుతుందన్నారు. చంద్రమౌళి మాట్లాడుతూ.. వాన వచ్చినప్పుడు వచ్చే వరదను ఒడిసిపట్టుకోకుండా వరదే కదా అని వదిలేస్తే భూగర్భ జలాలు పెరగవని, అప్పుడు ఎన్ని ఫీట్లు బోర్లు వేసినా నీళ్లు పోయవని చెప్పారు. కందకాల తవ్వకం ద్వారా సాగు ఫలప్రదమవుతుందని ప్రయోగాలు చెపుతున్నాయని, కందకాలు తవ్వుకున్న రైతులు నీళ్లకు ఇబ్బందులు పడకుండా వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ‘సాక్షి’ సాగుబడి డెస్క్ ఇన్చార్జి పంతంగి రాంబాబు ఈ అవగాహన సదస్సులకు సమన్వయకర్తగా వ్యవహరించగా, జడ్పీ చైర్మన్ ఎన్.బాలూనాయక్, జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ కె.దామోదర్‌రెడ్డి, విశ్రాంత ఇంజనీర్ ఎల్లారెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని 8 మండలాలకు చెందిన రైతులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారు. -
మంత్రి ఆదేశాలు బేఖాతరు
- మొక్కుబడిగా అవగాహన సదస్సులు - కనీసం కరపత్రాలు పంపిణీ చేయని అధికారులు - స్పెషల్ డివిజన్ కార్యాలయంలో మూలుగుతున్న కరపత్రాలు సాక్షి, విజయవాడ : భూగర్భ జలాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీరు-చెట్టు పథకం కింద పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా చెరువుల్లో పూడిక తీయడంతో పాటు వర్షపు నీరు వాగులు, వంకల్లోకి ప్రవహింపజేయడం, వర్షపు నీటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవచ్చో తెలియజేస్తూ లక్షలు రూపాయలు వెచ్చించి వాటర్ షెడ్స్ కరపత్రాలను ముద్రించారు. ఈ కరపత్రాల్లో ఆయా మండలాల్లో వర్షపాతం, వాగులు, చెరువుల వివరాలు, భూగర్భ జలస్థితి, బావులు, బోరుల్లో నీటిమట్టం తదితర సమాచారం ఇచ్చారు. అలాగే వర్షపు నీటిని ఉయోగించుకుని భూగర్భజలాలను ఎలా పెంచుకోవచ్చో వివరించారు. ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన జలవనరుల సలహామండలి సమావేశంలో ఈ కరపత్రాలను మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు స్వయంగా ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు కరపత్రాలు అందజేయాలని, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలని ఇంజినీర్లుకు సూచించారు. మండలాలకే చేరని కరపత్రాలు.. లక్షలు ఖర్చు చేసి ముద్రించిన కరపత్రాలు ఇరిగేషన్ ప్రాంగంణంలోని స్పెషల్ డివిజన్ కార్యాలయంలో పడి ఉన్నాయి. ఈ నెల రెండు నుంచి 11వ తేదీ వరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రేపటితో అవగాహన సదస్సులు ముగుస్తుండగా ఇప్పటి వరకు ఒక్క మండలానికి కానీ, గ్రామానికి కానీ ఈ కరపత్రాలు పంపలేదు. రైతులకు ఎంతో ఉపయోగపడే సమాచారానికి సంబంధించిన కరపత్రాలు కార్యాలయంలో పడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల్లో రైతులు భూగర్భ జలాల గురించి సమాచారం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఇరిగేషన్ అధికారులను పరుగులు పెట్టిస్తానంటూ మంత్రి దేవినేని హడావుడి చేస్తుంటే.. మరో వైపు రైతులకు కావాల్సిన సమాచారంతో ముద్రించిన కరపత్రాలను వారికి అందించకుండా మొక్కుబడిగా అవగాహన సదస్సులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. తూతూ మంత్రంగా అవగాహన సదస్సులు.. మెట్ట ప్రాంతాల్లోని గ్రామాల్లో జరుగుతున్న నీరు- చెట్టు అవగాహన సదస్సులను అధికారులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. రైతులు వ్యవసాయపనులకు వెళ్లే సమయానికి ఇరిగేషన్ అధికారులు గ్రామాల్లోకి చేరుకుంటున్నారు. కనీసం పదిమంది రైతులు లేకపోయినప్పటికీ హడావుడిగా సదస్సును నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల నిర్ణీత సమయం కంటే రెండు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం అవుతోంది. మైలవరం నియోజకవర్గంలో చంద్రాల, చండ్రగూడెం, పొందుగల తదితర గ్రామాల్లోనూ మొక్కుబడిగానే సదస్సులు జరిగాయి. కేవలం టీడీపీ నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించి సమావేశాన్ని ముగిస్తున్నారు. నీరు- చెట్టుపై రైతులకు అవగాహన కల్పించాలంటూ మంత్రి ఇచ్చిన ఆదేశాలు ఆయన సొంత జిల్లాలోనే ఏ మాత్రం అమలు కావడం లేదు. కొన్నిచోట్ల నీరు-చెట్టు కింద జరుగుతున్న సమావేశాలకు హజరవుతున్నప్పటికీ.. రైతులు రుణమాఫీ జరగలేదంటూ అధికారులను నిలదీస్తూ ఉండటంతో వారు అవాక్కవుతున్నారు. -
‘నీరు’గారుతున్న లక్ష్యం
- జనాలు లేక వెలవెల బోతున్న నీరు-చెట్టు అవగాహన సదస్సులు - పింఛన్ల రద్దుపై దుమారం - కుప్పంలో అధికారులకు చుక్కెదురు - రుణమాఫీ చేయాలంటూ నిలదీత - నామమాత్రంగా సమాచార సేకరణ సాక్షి ప్రతినిధి తిరుపతి: జిల్లాలో నీరు-చెట్టు అవగాహన సదస్సులు ప్రహసనంగా మారాయి. జనాలు రాక సభలు వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల కొత్త పింఛన్లు ఇస్తాం రండి అంటూ అధికారులు మభ్యపెట్టి ప్రజలను తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రాతి నిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా ఈ సభలకు చుక్కెదురవుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొన్నిచోట్ల ‘నీరే లేదు చెట్లు ఎక్కడ నాటాల’ అంటూ జనం అధికారులను నిలదీశారు. మొత్తం మీద నీరు-చెట్టు అవగాహన సదస్సులను తుతూ మాత్రంగా నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గ్రామ పంచాయతీల నుంచి నామమాత్రంగా సమాచారం సేకరించి సరిపెడుతున్నారు. దీంతో నీరు- చెట్టు లక్ష్యం నీరుగారిపోతోంది. కుప్పంలో అధికారులకు చుక్కెదురు కుప్పం నియోజకవర్గంలో సైతం నీరు-చెట్టు అవగాహన సదస్సులకు జనాలనుంచి స్పందన కరువైంది. శనివారం శాంతిపురం మండలంలోని మఠం గ్రామంలో సభలు ప్రారంభించారు. ఆ సభకు జనాలు లేకపోవడంతో ఉపాధి కూలీలను తీసుకురావాల్సి వచ్చింది. దీంతో సదస్సు ఆలస్యంగా ప్రారంభమైంది. రెండోరోజు శివరామపురంలో జరిగిన సదస్సులో అధికారులకు చిక్కులు తప్పలేదు. పింఛన్ల రద్దుపై దుమారం రేగింది. అర్హులైన వారి పింఛన్లను తొలగించి అనర్హులకు ఇచ్చారని పలువురు దుమ్మెత్తిపోశారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది రైతులు వేరుశెనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదంటూ నిలదీశారు. కొత్త పింఛన్లు ఇస్తామని.. జిల్లాలో నీరు-చెట్టు సదస్సుకు జనాలు రాకపోవడంతో పలమనేరు, గంగాధర నెల్లూరు, సత్యవేడు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల్లో కొత్తగా పింఛన్లు ఇస్తామని సభలకు జనాలను తరలిస్తున్నారు. పలమనేరు నియోజకవర్గంలో కొన్నిచోట్ల సభలు ప్రారంభం కాగానే నీరు-చెట్టు ఏమీ వద్దు మాకు రుణమాఫీ చేయాలంటూ రైతులు నిలదీయడంతో అధికారులు తెల్లముఖం వేశారు. కొన్నిచోట్ల జరిగిన సదస్సులకు అంగన్వాడీ వర్కర్లు, ఉపాధి కూలీలు, జన్మభూమి కమిటీ సభ్యులు తప్ప ఇతరులు ఎవరూ హాజరుకాలేదు. తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు మండలంలో అధికారుల తీరుకు నిరసనగా టీడీపీ ప్రజా ప్రతినిధులు కూడా సదస్సులకు హాజరుకాక పోవడం విశేషం. పీటీఎం మండలం మల్లెల గ్రామ సభలో ప్రజలనుంచి అధికారులకు చుక్కెదురైంది.. ‘ఇంతకు మునుపు జన్మభూమి సభలోనే మొక్కలు ఇస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వలేదు’ అని కొందరు మండిపడ్డారు. ‘అటవీ సంపద అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకోరు. ముందు అటవీ సంపదను కాపాడండి. ఆతరువాత కొత్త మొక్కలు ఇవ్వండి’ అని మరికొందరు నిలదీశారు. ప్రతిచోటా పింఛన్ల తొలగింపుపై అధికారులకు నిరసనల సెగ తప్పలేదు.