కర్నూలు, న్యూస్‌లైన్:
ప్రజా ఉద్యమంలో పాల్గొనకుండా.. పదవులను విడవలేకపోతున్న నాయకుల వెన్నులో చలి మొదలైంది. సమైక్యాంధ్ర పరిరక్షణకు కంకణబద్ధులైన ఉద్యోగులు, ప్రజలు రాజీనామా చేయని నేతల భరతం పడుతున్నారు. బయటి నుంచి వచ్చే నాయకులైనా.. జిల్లా ప్రజా ప్రతినిధులైనా సమైక్యవాదుల ముప్పేట దాడితో వణికిపోతున్నారు. ఆరు నూరైనా విభజన ప్రకటనను విరమించుకునే వరకు పోరుబాట వీడబోమని భీష్మిస్తున్నారు.. కలసిరాకపోతే నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సమైక్యాంధ్ర పరిరక్షకులు సింహాలై గర్జిస్తున్నారు. ఆదివారం కర్నూలులోని గౌరీగోపాల్ ఆసుపత్రి సమీపంలో కొత్తగా నిర్మించిన సస్య ప్రైడ్ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి అడుగడుగునా అవాంతరాలు తప్పలేదు. ఈ ఒక్క ఘటనతో రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని వెంట తెచ్చుకున్నా.. పోలీసు బలగాలను భారీగా మోహరించినా సమైక్యవాదులను నిలువరించలేకపోయారు.
ప్రారంభోత్సవాన్ని ముగించుకుని వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకుని ‘డ్రామాలు కట్టిపెట్టి పదవికి రాజీనామా చేయాలని’ పెద్ద ఎత్తున నినదించారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్ పైకి చెప్పు విసరడం ఆగ్రహావేశాలకు కారణమైంది. రెచ్చిపోయిన మంత్రి కారు నుంచి బయటకొచ్చి మీసాలు మెలేసి తొడ కొడుతూ అసలుసిసలైన సమైక్యవాదిని తానేనంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే న్యాయవాదులు సైతం అంతే ఆగ్రహంతో ఆయన తీరుపై విరుచుకుపడ్డారు. చివరకు పోలీసులు అతి కష్టం మీద ఉద్యమకారుల అడ్డు తొలగించి ఆయన కాన్వాయ్‌ను ముందుకు కదిలించారు. ఇంతలో టీజీ అనుచరులు న్యాయవాదుల దీక్షా శిబిరంపైకి చెప్పులు విసరడంతో మరోసారి పరిస్థితి అదుపు తప్పింది. ఇరు వర్గాల మధ్య తోపులాటతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత న్యాయవాదులను అరెస్టు చేయడంపై ఉద్యమకారులు మండిపడ్డారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు కార్యకర్తలు స్థానిక నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌ను ముట్టడించడంతో పాటు రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. ఇదే సమయంలో జేఏసీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
ఆందోళనకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఉద్యమకారులను బేషరతుగా వదిలేశారు. అయితే మంత్రి టీజీ తీరుపై అన్నిపక్షాల జేఏసీలు దుమ్మెత్తిపోశాయి. పోలీసులు సైతం మంత్రి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
మంత్రి టీజీ వెంకటేష్‌కు సమైక్య సెగ
Published Mon, Sep 16 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement