
పుష్కర స్నానమాచరించిన అమాత్యులు
గోష్పాదక్షేత్రం (కొవ్వూరు) : కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో బుధవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మురళీమోహన్ పుష్కర స్నానం ఆచరించారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పుష్కరాలలో పారిశుధ్య పరిస్థితులపై అప్రమత్తంగా ఉంటూ పటిష్ట చర్యలు తీసుకోవడంలో కలెక్టర్, పంచాయతీరాజ్ సిబ్బంది ఎనలేని కృషిచేస్తున్నారని కొనియూడారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
జిల్లాలోని అన్నిశాఖల అధికారులు అందిస్తున్న సేవలతో పాటు గతంలో ఎన్నడూ లేనివిధంగా స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ గోదావరి తల్లి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నానన్నారు. పుష్కర స్నానమాచరించిన ఆయన పిండ ప్రదాన షెడ్డు వద్ద పితృదేవతలకు క్రతువులు నిర్వహించారు.