నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ | Minute delayed no entry | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Published Tue, Mar 1 2016 3:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

Minute delayed no entry

రేపటి నుంచి నుంచి ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి
* 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్
* బృందాలతో ప్రత్యేక నిఘా
* ఆర్‌ఐఓ పాత్రుని పాపారావు


శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో బుధవారం నుంచి 21వ తేదీ వరకూ జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియెట్ విద్యామండలి జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐఓ) పాత్రుని పాపారావు తెలిపారు. అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన (ఉదయం 9 గంటల తరువాత) పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

ఆర్‌ఐఓ కార్యాలయంలో సోమవారం సాయంత్రం డీఈసీ కమిటీ సభ్యులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 96 (47 ప్రభుత్వ, 49 ప్రైవేటు కళాశాలలు) కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు జనరల్, ఒకేషనల్, ప్రైవేటు, బ్యాక్‌లాగ్ ఇలా మొత్తం 59,385 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం 29,549, ద్వితీయ సంవత్సరం 29,836 మంది ఉన్నారన్నారు.  

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని.. విద్యార్థులు నిర్ణీత సమయానికి హాజరుకావాల్సిందేనన్నారు. గతంలో 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చేవారిని కూడా పరీక్షకు అనుమతించేవారని..  ఈ ఏడాది మాత్రం ఇంటర్‌బోర్డు అధికారులు ఆ అవకాశం ఇవ్వలేదని వివరించారు.
 
పరీక్షల నిర్వహణ కోసం 96 మంది సీఎస్‌లు, 96 మంది డీవోలు, 49మంది ఏసీఎస్‌లను, 19 మంది కస్టోడియన్లను నియమించామన్నారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని 37 పోలీస్‌స్టేషన్లకు ఇప్పటికే ప్రశ్నపత్రాలను చేరవేశామన్నారు.
 
సెల్ఫ్‌సెంటర్లతోపాటు సమస్యాత్మక కేంద్రాలు, గతంలో కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలున్న కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు తనిఖీ బృందాలను నియమించామన్నారు. డీఈసీ కమిటీ, ఒక హైపవర్ కమిటీతోపాటు 4 ఫ్లయింగ్, 5 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యత్‌శాఖ, వైద్యఆరోగ్యశాఖ, పోస్టల్‌శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. సమావేశంలో డీఈసీ సభ్యులు సనపల ఈశ్వరరావు, ఐ.శంకరరావు,  జీ.వి.జగన్నాథరావు, హైపవర్ కమిటీ సభ్యుడు బొడ్డేపల్లి మల్లేశ్వరరావు, జిల్లా బల్క్ ఇన్‌చార్జిపేడాడ రాంబాబు, ఏవో సుధాకర్ పాల్గొన్నారు.

సుదూర ప్రాంతాలతోపాటు గ్రామీణా ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను  తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 10 రూట్లలో ఆర్టీసీ బస్సులను నడపనున్నట్టు అధికారులు తెలిపారు.
 
ఎచ్చెర్ల-కింతలి, రణస్థలం-లావేరు, పోలాకి-ప్రియాగ్రాహారం, నౌపడ-పూండీ,  భామిని-కొత్తూరు, కోల్లివలస-బూర్జ, పాలకొండ-సీతంపేట, సోంపేట-కంచిలి,   పలాస-పెద్దమడి, టెక్కలి-నందిగాం,  హరిపురం-మందస రూట్లలో పరీక్ష ప్రారంభానికి గంట ముందు, పరీక్ష పూర్తయిన 15 నిమిషాల తర్వాత బస్సులను నడపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement