
ఎమ్మెల్యే గాంధీకి హైకోర్టులో ఊరట
ఎన్నికల పిటిషన్‌కు సంబంధించి నోటీసులు అందుకున్నా కోర్టు ముందు తను గానీ.. తన తరఫు న్యాయవాది...
- ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు నిలుపుదల
- వాదనలు వినిపించేందుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల పిటిషన్‌కు సంబంధించి నోటీసులు అందుకున్నా కోర్టు ముందు తను గానీ.. తన తరఫు న్యాయవాది గానీ హాజ రుకాకపోవడంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీని ఎక్స్‌పార్టీగా ప్రకటిస్తూ అంతకు ముందు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు శనివారం నిలుపుదల చేసింది. సెక్షన్‌కు సంబంధించి జరిగిన పొరపాటు వల్ల తాను దాఖలు చేసిన వకాలత్ రికార్డుల్లో చేరలేదని, కేసులో వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ గాంధీ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు ఎక్స్‌పార్టీ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ, ఈ అనుబంధ పిటిషన్‌ను అనుమతించారు. ఇదిలా ఉండగా.. ఇదే విధంగా ఎక్స్‌పార్టీ అయిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద సైతం తనకూ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి, దీనిపై అభ్యంతరాలు ఉంటే వాటిని కౌంటర్ రూపంలో కోర్టు ముందుంచాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.హన్మంతరెడ్డిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు.