రాజధాని అభివృద్ధి పేరుతో రైతులు పొట్టకొట్టి గుంజుకున్న వేలాది ఎకరాలను సింగపూర్, జపాన్ కంపెనీలకు...
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
నరసరావుపేటవెస్ట్ : రాజధాని అభివృద్ధి పేరుతో రైతులు పొట్టకొట్టి గుంజుకున్న వేలాది ఎకరాలను సింగపూర్, జపాన్ కంపెనీలకు 99ఏళ్లపాటు లీజుకు ఇచ్చి మరోసారి విదేశీపాలనను రాష్ర్ట ప్రజలకు సీఎం చంద్రబాబునాయుడు రుచి చూపబోతున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ఉండాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు బంగారు పంటలు పండే భూములను దోచి పెట్టేందుకే చీకటి జీవోలు జారీచేస్తున్నారన్నారు.
ట్రాన్స్‌పరెన్సీ గురించి మాట్లాడే చంద్రబాబు 110 జీవోను ఎందుకు వెబ్‌సైట్‌లో పెట్టలేదో, దీని వెనుక ఉన్న చీకటి ఒప్పందాలను బహిరంగ పర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరు ఎయిర్‌పోర్టులకు 90వేల ఎకరాలు సేకరించాలని చూడడం ప్రభుత్వ భూదాహానికి అద్దం పడుతుందన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమిలేదన్నారు. ప్రభుత్వం పద్ధతులు మార్చుకోకుంటే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదన్నారు. రైతన్నల అండలతో ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయంచేస్తామన్నారు. సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.