మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జలీల్‌ఖాన్
విజయవాడు: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 27ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఈ 27ఏళ్లలో జాతీయ పార్టీ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పార్టీలకు అధ్యక్షుడిగా పనిచేశానని జలీల్ ఖాన్ అన్నారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున మూడు నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానాల్లో అందరు అభ్యర్థులు ఓడిపోయినా తాను గెలిచానని గుర్తు చేసుకున్నారు. ఈ సారి వైఎస్సార్సీపీ తరపున గెలిచినా అభివృద్ధి కోసమే తిరిగి తెలుగుదేశంలో చేరానని చెప్పారు.
రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలు 12శాతం ఉన్నారని నంద్యాల నుంచి మొదలుపెడితే కడప, రాయచోటి నుంచి ముస్లింలను తెలుగుదేశానికి ఓట్లు వేయిస్తాన్నారు. చంద్రబాబునాయుడుని నమ్మి పార్టీలోకి వచ్చానని, తన జీవితం ముఖ్యమంత్రి చేతుల్లో ఉందని జలీల్‌ఖాన్ అన్నారు. ముస్లింలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
గతంలో జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. ఆసమయంలో 'ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్ డిగ్రీ సాధించా'నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్ 'బీకామ్ ఫిజిక్స్' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకున్నారు.