ఈ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివారట! | AP MLA, Jaleel Khan claims to have done ‘BCom (physics)’, | Sakshi
Sakshi News home page

ఈ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివారట!

Published Thu, Dec 29 2016 4:33 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM

ఈ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివారట!

ఈ ఎమ్మెల్యే బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివారట!

'నవ్విపోదురుగాక నాకేంటి..' అన్నట్లు టీడీపీలో చేరిన ఓ ఎమ్మెల్యే తప్పు మాట్లాడిందేకాక, బహుగా సమర్థించుకున్నారు. 'ఫిజిక్స్‌, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్‌ డిగ్రీ సాధించా'నంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్‌ 'బీకామ్‌ ఫిజిక్స్‌' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకుంటుంటే.. కొందరు మాత్రం దీన్నో సీరియస్‌ అంశంగా చూడాలంటున్నారు.

'పొలిటికల్‌ సైన్స్‌లో వంటల గురించి బోధిస్తారు'.. అంటూ బిహార్‌కు చెందిన టాప్‌ ర్యాంకర్‌ రూబీ రాయ్‌ సృష్టించిన ఉదంతం గుర్తుందికదా! సరిగ్గా అదే తరహాలో 'ఫిజిక్స్‌ చదివి బీకామ్‌ డిగ్రీ పొందా'నంటూ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ చెప్పుకున్నారు. ఓ న్యూస్‌ పోర్టల్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. డిసెంబర్‌ 27న యూట్యూబ్‌లో పోస్ట్‌ అయిన ఆ వీడియోలో.. చిన్నతనం నుంచే మ్యాథ్స్‌ జీనియస్‌నని, ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో బీకామ్‌ డిగ్రీ చదివానని ఖాన్‌ చెప్పుకున్నారు. ఎమ్మెల్యేగారి సమాధానంతో అవాక్కైన రిపోర్టర్‌.. 'బీకామ్‌లో ఫిజిక్స్‌ మ్యాథ్స్‌ ఎక్కడున్నాయండీ..!' అని ఎదురు ప్రశ్నించినా ఏ మాత్రం తగ్గకుండా తన వాదనను కొనసాగించారు. 'ఏం? బీకామ్‌లో ఫిజిక్స్‌ లేకపోవడమేంటి? మ్యాథ్స్‌ కూడా ఉంటుందిగా! కావాలంటే నా సర్టిఫికేట్స్‌ చూపిస్తా..'అని జలీల్‌ ఖాన్‌ తన స్టేట్‌మెంట్‌ను సమర్థించుకున్నారు.

సదరు న్యూస్‌ పోర్టల్‌ ఈ ఇంటర్వ్యూను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడమే ఆలస్యం.. జలీల్‌ ఖాన్‌ దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిపోయారు. పలు ఇంగ్లిష్‌, హిందీ వార్తా సంస్థలు ఏపీ ఎమ్మెల్యే చదువుల వ్యవహారంపై వార్తలు ప్రసారం చేశాయి. బిహార్‌కు చెందిన రూబీ రాయ్‌.. స్కూల్‌ బోర్డు పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడి, ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి, ఓ టీవీ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోవడం, కాపీ కొట్టి మోసానికి పాల్పడినందుకుగానూ ఆమెపై కేసు నమోదుచేసి జైలుకు పంపడాన్ని గుర్తుచేస్తూ ఈ ఏపీ టీడీపీ నేత మాత్రం అందుకు అర్హుడుకాడా? అని ప్రశ్నించాయి.

ఫిజిక్స్‌తో బీకామ్‌.. చదవాలనుకున్నా!
సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతోన్న తన ఇంటర్వ్యూ వీడియో గురించి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఓ జాతీయ వార్తా సంస్థకు వివరణ ఇచ్చారు. 'ఆ రిపోర్టర్‌ చాలా సార్లు బతిమాలడంతో ఇంటర్వ్యూకు ఒప్పుకున్నా. బాగా పొద్దు పోయిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అంటే నాకు చాలా ఇష్టం. అయితే బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివానని మాత్రం నేను అనలేదు. వీడియోను ఎడిట్‌చేసి అననివి అన్నట్లు చూపించారు. సరే, తప్పో, ఒప్పో, నేను మాట్లాడిన మాటలతో నేను పాపులర్‌ అయ్యాను. నాకు ఫ్రీ పబ్లిసిటీ దొరికింది. రాజకీయనాయకుడిగా నాకు అంతకంటే కావాల్సింది ఏముంది?' అని జలీల్‌ ఖాన్‌ ఈ వ్యవహారాన్ని తేలికగా కొట్టిపారేశారు .
జలీల్‌పై సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న కామెంట్స్‌ కొన్ని..




Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement