పెరవలిలో ఎన్నికల నిర్వహణలో ఉన్న వీఎస్‌టీ టీం
సాక్షి, పెరవలి: ఎన్నికల విధి నిర్వహణ ఉన్న వీడియో గ్రాఫర్‌పై స్థానిక ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పీఏగా పనిచేస్తున్న నాని తీవ్ర దుర్భాషలాడి దౌర్జన్యంగా కెమెరాను లాక్కున్న సంఘటన శనివారం కొత్తపల్లి అగ్రహారంలో జరిగింది. పెరవలి మండలంలోని కొత్తపల్లి అగ్రహారం గ్రామంలో ఎమ్మెల్యే సతీమణి విశాలాక్షి కొందరు మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వీఎస్‌టీ టీమ్ (వీడియో సర్వే లైన్స్ టీమ్) వచ్చి ప్రచారాన్ని వీడియో తీస్తున్నారు. అక్కడే ఉన్న నాని ఉరుకున వచ్చి కెమేరామెన్ ఆంజనేయులుపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. కెమేరాను లాక్కుని నేలకేసి కొట్టాలని నాని తన అనుచరులకు పురమాయించారు. ఆ కెమేరామెన్ తన ఐడీ కార్డును చూపించినప్పటికీ నాని వినలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో కెమేరామెన్ తన పైఅధికారి ఎం.జోగారావుకు జరిగిన ఘటనను ఫోన్‌లో వివరించాడు. దీంతో ఆయన నానితో సంప్రదింపులు జరిపిన తర్వాత కెమేరాను వెనక్కి ఇచ్చారు.
ప్రభుత్వానికి సంబంధించిన విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దుర్భాషలాడడం, కెమేరాను లాక్కోవడం చట్టరీత్యా నేరమని ఎన్నికల అధికారులు తెలిపారు. జరిగిన ఘటనపై ‘సాక్షి’ కెమేరామెన్ ఆంజనేయులను సంప్రదించగా తమ ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ప్రచారాన్ని కవర్ చేస్తుండగా ఎమ్మెల్యే శేషారావు పీఏ నాని వచ్చి దుర్భాషలాడారని, ఐడెంటిటీ కార్డును చూపించినా దౌర్జన్యంగా కెమెరాను లాక్కున్నారని తెలిపాడు. జోగారావును వివరణ అడగగా కెమెరాను లాక్కోవడం వాస్తవమేనని తెలిపారు. తహసీల్దార్ సీహెచ్ విజయభాస్కర్‌ను వివరణ అడగగా తాను ఎన్నికల నిర్వహణలో నిడదవోలులో ఉన్నానని పెరవలి ఎస్సై గారిని వివరాలు అడగాలని తెలిపారు. ఎస్సై వి.జగదీశ్వరరావుని అడగగా తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే కేసు కడతామని తెలిపారు. ఎమ్మెల్యే శేషారావుకు నాని పర్సనల్ పీఏగా వ్యవహరిస్తారని స్థానికులు తెలిపారు. నాని తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment