
హత్యా రాజకీయాలకు ప్రభుత్వ ప్రోత్సాహం
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం
- చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారు
- రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారు
పుత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఆమె ఖండించారు. నడిరోడ్డుపై కత్తులు, తుపాకులతో టీడీపీ నాయకులు చెలరేగుతుంటే అణచివేయాల్సిన పోలీసులు వారిని బుజ్జగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. అర్హత లేని వారికి గన్‌మెన్ సౌకర్యం కల్పించడమే కాకుండా వారిని ప్రతిపక్షాలపైకి, ప్రజలపైకి ఉసిగొల్పి సీఎం చంద్రబాబు నాయుడు రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టీడీపీ నాయకులకు తుపాకులు, బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డి హత్య, ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం వర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఇద్దరు చనిపోయినా ఆ కేసులు ఇంతవరకూ అతీగతీ లేకుండా పోయాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. హత్య, అత్యాచారం కేసుల్లో నిందితులను కాపాడేందుకు 120 జీవోలను జారీ చేసిన చంద్రబాబుకు హైకోర్టు మొట్టికాయలు వేసినా బుద్ధిరాలేదని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలకు జరగడానికి చంద్రబాబు ప్రభుత్వం ఆజ్యం పోస్తోందన్నారు. చంద్రబాబుకు, టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.