బాబుకు గ్రేడింగ్ ఇస్తే సున్నా
పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన
పామర్రు : అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన 5 హామీల్లో ఇంతవరకు స్పష్టత రాలేదని, ప్రభుత్వం వెంటనే వీటిపై స్పష్టత ఇవ్వాలని పామర్రు ఎమ్మెల్యే ,శాసనసభలో వైఎస్సార్‌సీపీ డెప్యూటీ ప్లోర్ లీడర్ ఉప్పులేటి కల్పన డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయలలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ చేయకుండా మార్గదర్శకాల పేరిట కమిటీలను ఏర్పాటు చేయడానికే పరిమితమయ్యారని విమర్శించారు. రైతు, డ్వాక్రా రుణాలపై సాధికారిత కమిటీలను ఏర్పాటు చేసి సంవత్సరానికి 20శాతం రుణాలను మాత్రమే రద్దు చేస్తామని చెప్పడం వారిని అయోమయానికి గురిచేస్తోందని తెలిపారు.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు తమ మంత్రులకు గ్రేడింగ్ ఇస్తున్నారని, మరి సీఎంకు గ్రేడింగ్ పెడితే ‘0’ వస్తుందని ప్రజలు వాపోతున్నరన్నారు. జన్మభూమి-మావూరు కార్యక్రమంపై సీఎం తెలిపిన విధి విధానాల ప్రకారం ప్రతీ కార్యక్రమాన్ని ఆయా పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యేల ద్వారా నిర్వహించాలని ఉందన్నారు. కానీ పామర్రు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమంలా లేదన్నారు. ఇది కేవలం టీడీపీ సమావేశంలా ఉందన్నారు. ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించడం లేదన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన చోట ఓడిపోయిన టీడీపీ నాయకులను వేదికలపైకి ఎక్కించి పార్టీల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇప్పిస్తున్నారన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ పక్కనే ఉన్నా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి వర్ల రామయ్య వేదిక మీదకు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన, ఎమ్మెల్యే హక్కులకు భంగం కల్గించినందుకు, జన్మభూమికి సంబంధం లేని వ్యాఖ్యలు చేసి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరుగనీయనందుకు, ఎమ్మెల్యే, సర్పంచులను అవమానపర్చినందుకు వర్లపై ‘సభా హక్కుల కమిటీ’లో ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమం సక్రమంగా నిర్వహించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరతామని అన్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా చేయవద్దని వర్లని హెచ్చరించారు. పామర్రు గ్రామ ఉపసర్పంచి అరేపల్లి శ్రీనివాసరావు, తోట్ల వల్లూరు మండలం ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, కనుమూరు సర్పంచి బొప్పూడి మేరి కమల, కురుమద్దాలి, కొండిపర్రు ఎంపీటీసీలు కొలుసు ఆదిలక్ష్మీ, బీవీ రాఘవులు, నాయకులు ఆర్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వర్లకు మతి భ్రమించింది....
కనుమూరు(పామర్రు) : ప్రజా ప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలకు టీడీపీకి చెందిన వర్ల రామయ్యను ఏ హోదాలో ఆహ్వానించారని సంబంధిత అధికారిపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘జన్మభూమి-మా వూరు’ కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామ సర్పంచి బొప్పుడి మేరికమలకు అధ్యక్ష స్థానం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల విజిట్ పుస్తకంలో వర్ల రామయ్య సంతకం పెట్టడంపై కల్పన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది పార్టీ కార్యక్రమం కాదు, వర్ల రామయ్య ప్రజా ప్రతినిధి కాదు అయినా ఆయనతో ఏ హోదాతో సంతకం పెట్టించారని సంబంధిత అధికారిని ప్రశ్నించారు. దీనిపై అధికారులు నీళ్లు నమిలారు. దీంతో వర్ల కల్పనపై విరుచుకు పడారు. వర్ల మాట్లాడుతూ ఇది తమ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమమని, పార్టీ సభ్యుడుగా తాను పాల్గొన్నానని చెప్పారు. ఎమ్మెల్యేనుద్దేశించి అవహేళనగా మాట్లాడారు. దీనిపై ఆగ్రహించిన కల్పన మాట్లాడుతూ ఓటమి చెందడంతో మతి భ్రమించి కుసంస్కారంతో మాట్లాడవద్దని హితవు పలికి సభాప్రాంగణం నుంచి వాకౌట్ చేశారు.