వర్ల రామయ్యపై చంద్రబాబు ఫైర్
విజయవాడ: టీడీపీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్యపై ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం ఫైర్ అయ్యారు. పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దంటూ వర్ల రామయ్యకు క్లాస్ పీకారు. నిన్న కనుమూరులో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని వర్ల రామయ్యను చంద్రబాబు హెచ్చరించారు. శనివారం కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని కనుమూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపై టీడీపీ నేత వర్ల రామయ్య తెగ హడావుడి చేశారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు ఉప్పులేటి కల్పన ఏ హోదాతో వేదిక ఎక్కారని రామయ్యను ప్రశ్నించారు.
దీంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ రామయ్య హడావుడి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉంది మా ప్రభుత్వం. నేనే కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయాను. అది గుర్తుంచుకో అంటూ.. హెచ్చరించారు. అంతేకాదు రేపోమాపో నీవు కూడా మా పార్టీలోకే రావాల్సిందేనన్నారు. రామయ్య మాటలకు ఆగ్రహించిన కల్పన అనవసర వ్యాఖ్యలు చేయొద్దంటూ రామయ్యకు హితవు పలికారు. ఇటీవల పామర్రు శాసన సభకు జరిగిన ఎన్నికల్లో వర్ల రామయ్యపై ఉప్పులేటి కల్పన విజయం సాధించిన సంగతి తెలిసిందే.