
సాక్షి, హిందూపురం: రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. మండలిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా.. అందులో ఓ స్థానానికి ఇక్బాల్‌ను పోటీ చేయించనున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ సీపీకి ఉన్న సంఖ్యాబలం పరంగా ఈ మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉండగా.. ఇక్బాల్ త్వరలోనే ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఉప ఎన్నికల ఓటింగ్‌ను ఈ నెల 26న నిర్వహించి, అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు.
ఇచ్చిన మాట మేరకు....
ఐజీగా పదవీ విరమణ పొందిన మహమ్మద్ ఇక్బాల్ ఆ తర్వాత వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయనకు సముచిత స్థానం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డి హిందూపురం నుంచి బాలకృష్ణపై పోటీకి దింపారు. అయితే ఇక్బాల్ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇక్బాల్‌కు తొలి విడత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు కచ్చితంగా గెలిచే శాసనసభ్యుల కోటాలో ఆయన్ను మండలికి ఎంపిక చేశారు. సీఎం నిర్ణయంపై మైనార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీతోనే మైనార్టీల అభ్యున్నతి సాధ్యమని చెబుతున్నారు. మరోవైపు మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక సీటును జిల్లాకు కేటాయించడం.. త్వరలోనే ఇక్బాల్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు ఉండటంతో ‘అనంత’ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది.