పోరు ముగిసింది | mlc elections completed peacefully | Sakshi
Sakshi News home page

పోరు ముగిసింది

Published Fri, Mar 10 2017 1:17 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

పోరు ముగిసింది - Sakshi

పోరు ముగిసింది

► ప్రశాంతంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్‌
► జిల్లాలో 72.7% ఓటింగ్‌ నమోదు
► పొడవైన బ్యాలెట్‌ పత్రంతో ఓటర్ల తికమక
► అభ్యర్థుల ఫొటోల్లో లోపించిన స్పష్టత
► ఉదయం మందకొడిగా పోలింగ్‌
► సాయంత్రం 2 గంటల్లోనే 14% ఓటింగ్‌
► స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో బ్యాలెట్‌ బాక్సులు భద్రం


    ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ పోలింగ్‌ గురువారం ముగిసింది. జిల్లాలో 72.7 శాతం పోలింగ్‌ నమోదైంది.  జిల్లాలోనున్న 31,381 మంది ఓటర్లలో 22,815 మంది (72.7 శాతం) పట్టభద్రులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.  ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్దా రెండేసి శిబిరాలు ఏర్పాటు చేసిన బీజేపీ, టీడీపీ నాయకులు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగిసింది. తర్వాత పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్‌ బాక్స్‌లను శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి డివిజను కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఎన్నికల సిబ్బంది తరలించారు.    సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం

సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం:  శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల పరిధిలోనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 1,55,993 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలోనే 31,381 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అయితే వారిలో 22,815 మంది మాత్రమే గురువారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయం జిల్లాలోని 54 పోలింగ్‌ కేంద్రాల్లోనూ మందకొండిగా పోలింగ్‌ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు కేవలం 45 శాతమే నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 58.91 శాతానికి పెరిగింది. ఆఖరి రెండు గంటల సమయంలో ఓటింగ్‌ ఊపందుకుంది. సాయంత్రం ఆరు గంటలకు ఓటింగ్‌ ముగిసింది. మొత్తంమీద 72.7 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు అధికారులు ప్రకటించారు. జిల్లా కేంద్రం సహా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 54 పోలింగ్‌ కేంద్రాల్లో 407 మంది సిబ్బంది పోలింగ్‌ విధులు నిర్వహించారు. ప్రతి కేంద్రంలోనూ వెబ్‌కెమెరాలను ఏర్పాటు చేసి వెబ్‌ కాస్టింగ్‌ విధానంలో ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రక్రియను అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టరు పి.లక్ష్మీనరసింహం, జాయింట్‌ కలెక్టరు కేవీఎస్‌ చక్రధరబాబు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. అలాగే ఒక సూక్ష్మ పరిశీలకుడు (మైక్రో అబ్జర్వర్‌) సహా 13 మంది జోనల్‌ అధికారులు, 19 మంది రూట్‌ అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడంలో సఫలమయ్యారు.
 
నిబంధనలు పట్టని అధికారపార్టీ...: ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నాయకులు పలుమార్లు ఎలక్షన్‌ కోడ్‌ను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే తీరు పోలింగ్‌ రోజున కూడా కొనసాగింది. పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో అదీ పార్టీకి ఒక్కటి మాత్రమే శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ టీడీపీ, బీజేపీ నాయకులు మాత్రం రెండేసి శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ఓటర్లను ప్రభావితం చేయడానికి యథాశక్తి ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో బీజేపీకి కేటాయించిన ఒక్క ఎమ్మెల్సీ సీటులోనూ అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌ను గెలిపించకపోతే పొత్తు ధర్మానికి వెన్నుపోటు పొడిచారనే విమర్శలకు బలం చేకూరుతుంది. ఇది భవిష్యత్తులో ఇరు పార్టీల మైత్రిపై ప్రభావం చూపడమే గాకుండా ఓటుకు కోట్లు కేసులోనూ అధినేత చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవనే ఊహాగానాలు వస్తున్నాయి. అందుకే ఏదిఏమైనా మాధవ్‌ను గెలిపించి తీరాలని పార్టీ అధినేత చంద్రబాబు హుంకుం జారీ చేయడంతో టీడీపీ నాయకులు ఆపసోపాలు పడ్డారు.

వామపక్షాలు పక్కాగా ఏర్పాట్లు: ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో గతంలో రెండు సార్లు విజయం సాధించిన సీపీఎం నాయకుడు ఎంవీఎస్‌ శర్మ ఒరవడినే కొనసాగించేందుకు పీడీఎఫ్‌ అభ్యర్థిగా అజశర్మ బరిలో నిలిచారు. ఆయనకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాలతో పాటు వివిధ వృత్తి సంఘాల్లో గట్టి పట్టున్న ఆయనకే ఎక్కువ ఓట్లు పడ్డాయని అంచనా వేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి మాధవ్, కాంగ్రెస్‌ అభ్యర్థి యడ్ల ఆదిరాజులతో పాటు లోక్‌సత్తా మద్దతు ప్రకటించిన సీనియర్‌ జర్నలిస్టు (లీడర్‌) రమణమూర్తి, స్వతంత్య్ర అభ్యర్థి చింతాడ రవికుమార్‌లకు కూడా జిల్లాలో చెప్పుకోతగిన సంఖ్యలో ఓట్లు పడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. వారిలో చింతాడ రవికుమార్‌ టీడీపీ ఓట్లను చీల్చారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మాధవ్‌కు ఓట్ల శాతంలో కోత పడినట్లే! ఏదిఏమైనా త్వరలో జరిగే ఓట్ల లెక్కింపులో కనీసం 50 శాతం ఓట్లు సాధించినవారే ఎమ్మెల్సీ పీఠం దక్కించుకుంటారు.

జిల్లా కేంద్రంలో అత్యధికంగా 2,803 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తర్వాత స్థానంలో ఆమదాలవలస నిలిచింది. 1,780 మంది ఓటు వేశారు. అత్యల్పంగా వంగరలో 127 మంది, ఎల్‌ఎన్‌ పేటలో 131, భామినిలో 173 మంది ఓటు వేశారు. పోలింగ్‌ శాతం ప్రకారం చూస్తే సీతంపేటలో అత్యధికంగా 87 శాతం ఓటింగ్‌ నమోదైంది. తర్వాత స్థానాల్లో కంచిలి (84.10%), ఇచ్చాపురం (83.03%), టెక్కలి (83%), సంతబొమ్మాళి (81.45%), రణస్థలం (79.47%) నిలిచాయి. అత్యల్పంగా వంగర (45.36%), సంతకవిటి (59.61%) కేంద్రాల్లో ఓటింగ్‌ నమోదైంది.

ఓటింగ్‌లో పదనిసలు
► రాజాంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్‌ సరళిపై ఆరా తీశారు.
► టెక్కలి పోలింగ్‌ కేంద్రం వద్ద కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి గుర్తింపు కార్డు తీసుకురాలేదని ఎన్నికల సిబ్బంది అడ్డుకున్నారు. తర్వాత గుర్తింపుకార్డు తెచ్చి చూపించిన తర్వాత ఓటింగ్‌కు అనుమతించారు.
► పాలకొండ నియోకవర్గంలోని వీరఘట్టం, పాలకొండ, భామిని, సీతంపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగు కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
► ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ మంది ఉద్యోగులు, కార్మికులు మధ్యాహ్న భోజన విరామంలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
► రణస్థలం పోలింగ్‌ కేంద్రాన్ని విశాఖ రేంజ్‌ డీఐజీ శ్రీకాంత్‌ సందర్శించారు.
► ఇచ్చాపురం, కవిటి పోలింగ్‌ కేంద్రాలను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పరిశీలించారు.
► నరసన్నపేటలో పోలింగ్‌ కేంద్రాన్ని ఎస్పీ బ్రహ్మారెడ్డి పరిశీలించారు. నరసన్నపేటలోని నాలుగు మండలాల్లో టీడీపీ శ్రేణులు హడావుడి కాస్త ఎక్కువ కావడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు.
► పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, ఐటీడీఏ పీఓ ఎల్‌. శివశంకర్, డీఎస్పీ భార్గవరావునాయుడు పరిశీలించారు.
► ఆమదాలవలసలో పోలింగ్‌ కేంద్రం వద్ద టీడీపీకి చెందిన ఏజెంటు ఎం.రమేష్‌కుమార్‌ ప్రచారం చేస్తున్నట్లు ప్రత్యర్థి అభ్యర్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీం తో తహసిల్దారు తారకే శ్వరి సీఐ నవీన్‌కుమార్‌ సహాయంతో రమేష్‌ను కేంద్రం నుంచి బయటకు పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement