బలిజలకు మొండిచేయి!
Published Tue, Feb 28 2017 5:31 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
అనుకున్నదే జరిగింది. ‘అనంత’ బలిజలకు చంద్రబాబు మరోసారి మొండిచేయి చూపించారు. ‘గ్రేటర్ రాయలసీమ’లో చిత్తూరు మినహా అన్ని జిల్లాలలోనూ ఎమ్మెల్సీ టిక్కెట్లు ఒకే సామాజికవర్గానికి కేటాయించిన చంద్రబాబు కనీసం ‘అనంత’లోనైనా బలిజలకు కేటాయిస్తారని ఆ సామాజిక వర్గం నేతలు ఆశించారు. అయితే జిల్లాలోని బలిజలకు ఎమ్మెల్సీ ‘స్థాయి’ లేదంటూ పార్టీ అధిష్టానం తేలిగ్గా తీసుకుంది. సమీకరణల్లో బలిజలను మినహాయిస్తే...మైనార్టీకోటాలో తమకైనా టిక్కెట్టు దక్కుతుందని ఆశించిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, మాజీ ఎంపీ సైఫుల్లాను కూడా పార్టీ విస్మరించింది. చివరకు ఆర్థికబలం, అంగబలం ఉన్న దీపక్‌రెడ్డివైపు మొగ్గుచూపింది. సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో స్థానిక సంస్థల కోటాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును అధిష్టానం దాదాపుగా ఖరారు చేసింది.
► ‘స్థానిక’ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి!
► మైనార్టీనేతలు అబ్దుల్‌ఘని, సైఫుల్లాకూ నోచాన్ప్
► అధిష్టానం నిర్ణయంపై బలిజల ఆగ్రహం
► టీడీపీ జెండా మోసినందుకు బుద్ధి వచ్చిందంటూ ఆవేదన
అనంతపురం; ‘అనంత’ స్థానికసంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీడీపీ మల్లగుల్లాలు పడింది. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల టికెట్లు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడంతో ‘అనంత’ స్థానానికి బలిజ అభ్యర్థిని ప్రకటిస్తారని ఆ సామాజికవర్గ నేతలు భావించారు. ‘అనంత’లో టీడీపీ విజయంలో బలిజ సామాజికవర్గ నేతల పాత్ర కీలకంగా ఉంది. గత ఎన్నికల్లో ఆ సామాజికవర్గానికి ఒక్క ఎమ్మెల్యే టిక్కెట్టు కూడా టీడీపీ కేటాయించలేదు. అయినప్పటికీ జిల్లాలో 12 అసెంబ్లీలతో పాటు 2 ఎంపీ స్థానాలు టీడీపీ గెలిపించింది. ఇందులోనూ బలిజ సామాజికవర్గ పాత్ర కీలకంగా ఉంది.
ఈ క్రమంలో పట్టభద్రులకోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్నూలుకు చెందిన జనార్ధన్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. దీంతో కర్నూలు, లేదా అనంతపురంలో తమ వర్గానికి టిక్కెట్ కేటాయిస్తారని బలిజలు ఆశపడ్డారు. చంద్రబాబు కూడా ‘సీమ’లో ఎమ్మెల్యే టిక్కెట్ల కేటాయింపులో బలిజలను విస్మరించామని, కాపు, బలిజ, ఒంటరి, తెలగ ఉద్యమం తీవ్రంగా ఉన్న ఈ సమయంలో మళ్లీ వీరిని విస్మరిస్తే ఈప్రాంతంలో పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని భావించారు. దీంతోనే జిల్లా నేతలు దీపక్‌రెడ్డి, గడ్డం సుబ్రహ్మణ్యంపేర్లను తెరపైకి తెచ్చినపుడు ‘గ్రేటర్’లో అన్ని జిల్లాలలో రెడ్డి సామాజికవర్గానికి టిక్కెట్లు ఇస్తున్నామని, కనీసం ‘అనంత’లోనైనా బలిజలకు ఇవ్వాలని జిల్లా నేతలతో చెప్పారు.
ఈ విషయం తెలిసి టీడీపీ నేత లక్ష్మీపతి చంద్రబాబును కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఇది గ్రహించిన అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి లక్ష్మీపతికి అడ్డుకట్ట వేసేందుకు లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదెన్నకు మద్దతు తెలపడంతో, ఆదెన్న కూడా బాబు వద్ద తన వాణి వినిపించారు. కానీ బలిజ సామాజికవర్గంలో ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఎవ్వరూ లేరని జిల్లా పార్టీ నేతలు బాబుకు గట్టిగా చెప్పారు. దీంతో మైనార్టీ వర్గం వైపు కూడా బాబు ఆలోచించారు. బాలయ్య కోసం టిక్కెట్టు త్యాగం చేసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే ఘనీ పేరును పరిశీలించారు. దీనికి బాలయ్య అడ్డుపడ్డారు. దీంతో మాజీ ఎంపీ సైఫుల్లా కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నారు. పార్టీకోసం సైఫుల్లా తన కుమారుడు రహంతుల్లాను కోల్పోయారని, దీంతో సైఫుల్లా లేదా ఆయన కుమారుడు జకీవుల్లాకు ఇద్దామని ఆలోచించారు. వీరు పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడం లేదని ప్రభాకర్‌చౌదరితో పాటు పలువురు నేతలు బాబుకు చెప్పినట్లు తెలిసింది. దీంతో చంద్రబాబు అభ్యర్థి ఖరారుపై నిర్ణయానికి రాలేకపోయారు.
‘గ్రేటర్’లో అన్ని జిల్లాల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ‘అనంత’ అభ్యర్థి పేరు మాత్రం పెండింగ్‌లో ఉంచారు. దీపక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని జేసీ బ్రదర్స్ చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. జేసీ కుటుంబం నుంచి ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యేలుగా జేసీ బ్రదర్స్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో వారి కుటుంబానికే చెందిన ప్రభాకర్‌రెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డికి టిక్కెట్టు ఇవ్వడమేంటని పలువురు నేతలు జిల్లా నేతలతో వాదించారు. కానీ చివరకు దీపక్‌రెడ్డిపేరును ప్రకటిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
బలిజల మండిపాటు
టీడీపీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీలోని బలిజ సామాజికవర్గ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీలలో ఒక్కరూ బలిజలు లేరని, కనీసం ఎమ్మెల్సీనైనా చేస్తారనుకుంటే ఆస్థాయి తమకు లేదంటూ తమను తీవ్రంగా అవమానించారని ఇద్దరు కీలక నేతలు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బలిజలు ఈ అవమానాన్ని గుర్తుపెట్టుకుంటారని, పార్టీచేసిన ఈ తప్పుకు భవిష్యత్తులో తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు. కాలవ శ్రీనివాసులు, నిమ్మల కిష్టప్పలకు ఎంపీ టిక్కెట్టు కేటాయించినప్పుడు వారి స్థాయి ఏమిటో టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు. బీకే పార్థసారథికి టిక్కెట్టు ఇచ్చినపుడు ఆయనస్థాయి ఏమిటో తెలీదా? అని టీడీపీలో చురుగ్గా ఉన్న బలిజ సామాజికవర్గ నేత ఒకరు ప్రశ్నించారు. బలిజలను గౌరవించి రాజకీయప్రాధాన్యం కల్పించాలని చంద్రబాబు భావిస్తే ఎవరెన్ని చెప్పినా టిక్కెట్టు కేటాయించేవారని, ఈ ఉద్దేశం లేకపోవడంతోనే తమను విస్మరించారని ఆరోపిస్తున్నారు.
Advertisement
Advertisement