బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఆ పార్టీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అనంతపురం ఆర్‌ట్స కళాశాల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన ‘మోడీ ఫర్ పీఎం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. హంద్రీ నీవా, గాలేరు నగరి, పోలవరం, ప్రాజెక్టులకు జీవం పోస్తామన్నారు. సీమలో అగ్రికల్చర్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
బ్రహ్మణీ స్టీల్స్ ఏర్పాటు, సమాంతర కాలువ సాధనకు కృషి చేస్తామన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు పెద్దపీట వేస్తామన్నారు. కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని ఆయన ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో అవినీతికి అందలం.. ధరల పెరుగుదల.. కుమ్ములాటలు.. ప్రజా జీవనం చిన్నాభిన్నం చేసి స్వార్థపరుల జేబు సంస్థగా మారి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ కూడా ఒక పార్టీయేనా అంటూ విమర్శించారు. దేశంలోనే అత్యంత వీకెస్ట్ ప్రధాని మన్మోహన్ సింగ్, వీకెస్ట్ రాజకీయ నేత సోనియాగాంధీ అని ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు మన దేశంలో అలజడులు సృష్టిస్తున్నా ఏమీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు. నల్లధనాన్ని విదేశాల్లో దాచుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో యూపీఏ ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ విముక్త దేశానికి కంకణబద్ధులు కావాలని, బీజేపీని ఆదరించాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. థర్డ్‌ఫ్రంట్ పెట్టాలని ప్రయత్నిస్తున్న కమ్యూనిస్టులను నమ్ముకుంటే కొంపలు మునుగుతాయన్నారు. కమ్యూనిస్టుల్లో ఐక్యత సాధ్యం కాదన్నారు.
ఈ నేపథ్యంలో దేశంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా మారింద ని, నరేంద్ర మోడీ ప్రధాని కావాలనే నినాదం ప్రజ్వరిల్లుతోందన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్తా నడుం బిగించాలన్నారు. ప్రతి కార్యకర్తా వంద మందిని ఓటర్లుగా చేర్పించాలన్నారు. అనంతరం పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. సభలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు, బీజేపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవీందర్‌రాజు, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్ పార్థసారథి, జాతీయ నాయకులు శాంతిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నాయకులు మందరపు రమణ, రత్నమయ్య, ఫయాజ్, మల్లారెడ్డి, లలిత్‌కుమార్, ఆదిలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
చాయ్ తాగండి..!
‘నమో చాయ్’ కార్యక్రమంలో భాగంగా వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం డీఈఓ కార్యాలయ సమీపంలోని గెలాక్సీ టీస్టాల్ నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు, ప్రజలకు తానే స్వయంగా టీ ఇచ్చారు. దేశాన్ని అమ్మే కాంగ్రెస్ పార్టీ కంటే.. టీ అమ్ముకునే వాడే నయమని అన్నారు. మోడీ సైతం టీ అమ్ముకునే స్థాయి నుంచి వచ్చి నేడు ప్రధాని రేసులో ఉన్నారని గుర్తుచేశారు.
ఎన్‌టీ చౌదరికి భంగపాటు!
టీడీపీ మాజీ నేత ఎన్‌టీ చౌదరికి పరాభవం ఎదురైంది. టీకొట్టు వద్ద వెంకయ్యనాయుడు టీ ఇస్తుండగా.. పలువురు బీజేపీ నాయకులు వెంకయ్య పక్కన నిలబడ్డారు. అయితే ఎన్‌టీ చౌదరిని మాత్రం ఆహ్వానించలేదు. చివరికి ఆయన అనుచరులే అన్నా.. నువ్వు ముందుకుపో అంటూ వెంకయ్యనాయుడు వద్దకు పంపారు. సభలో కూడా అంత ప్రాధాన్యత కల్పించలేదన్న విమర్శలు వినిపించాయి.
‘సమైక్య’ సెగ
అనంతపురంలో ఆదివారం బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడుకు ‘సమైక్య’ సెగ తగిలింది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగిస్తుండగా.. పలు విద్యార్థి సంఘాల నాయకులు, సమైక్యవాదులు జై సమైక్యాంధ్ర.. అంటూ నినదిస్తూ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని పక్కకు నెట్టారు. ‘వాళ్లు మామూలే.. ఫొటోలకు ఫోజులు ఇస్తుంటారు.. అవేమీ పట్టించుకోకండి’ అంటూ వెంకయ్యనాయుడు సమైక్యవాదులపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో సమైక్యవాదులు మళ్లీ నినాదాలు చేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు.