భయం నీడన బతుకులు | The Monsoon Season is That The Tribes in The Agency Area Live in Shade | Sakshi
Sakshi News home page

భయం నీడన బతుకులు

Published Sat, Mar 30 2019 10:32 AM | Last Updated on Sat, Mar 30 2019 10:32 AM

The Monsoon Season is That The Tribes in The Agency Area Live in Shade - Sakshi

సాక్షి, బుట్టాయగూడెం : వర్షాకాలం వచ్చిందంటే ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు భయం నీడలో బతుకుతుంటారు. ఎత్తైన కొండలు, దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. కొద్దిపాటి వర్షం వచ్చినా కొండ వాగులు ఉధృతంగా పొంగుతుంటాయి. వాగులపై వంతెనల నిర్మాణాలు లేకపోవడంతో వర్షాకాలంలో గిరిజనులు ప్రయాణ బాధలు వర్ణనాతీతంగా మారతాయి. వాగులను దాటే ప్రయత్నంలో అనేక మంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి.

వర్షా కాలంలో ఎక్కువగా రెడ్డికోపల్లి సమీపంలోని కాలువ, కన్నారప్పాడు కాలువ, ముంజులూరు సమీపంలోని జారుడు కాలువ, రెడ్డిగొడ్డేరు సమీపంలోని జల్లేరు, వీరన్నపాలెం సమీపంలోని జల్లేరు వాగుతో పాటు అనేక కొండ వాగులు పొంగుతూ ఉంటాయి. గతంలో పట్టినపాలెం సమీపంలోని వాగు, ఇప్పలపాడు సమీపంలోని వాగు ప్రవాహంలో దాదాపు 30 మందికి పైగా కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటనలు జరిగాయి. 2016 సెప్టెంబర్‌ 22న గోగుమిల్లికి చెందిన లింగారెడ్డి అనే గిరిజన యువకుడు ముంజులూరు సమీపంలోని కాలువలో కొట్టుకుపోయి మృతి చెందాడు. 

ఐదేళ్లుగా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం
ఏటా గిరిజనులు పడే బాధలను నిర్మూలించడానికి 5 ఏళ్లుగా చంద్రబాబు పాలనలో కనీస ప్రయత్నం కూడా చెయ్యలేదని గిరిజనులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్‌ నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గంలో ఒక బ్రిడ్జి మంజూరైందని అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే పాలకులు ప్రకటించారు. కొంతకాలం తర్వాత పనులు చేపట్టినా అవి నేటికీ సాగుతూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నాయంటూ గిరిజనులు విమర్శిస్తున్నారు. గిరిజనుల వాగు కష్టాలు తీరాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తాను తప్పనిసరిగా కృషి చేస్తానని పోలవరం నియోజకవర్గ అభ్యర్థి తెల్లం బాలరాజు అన్నారు.

రూ.26 కోట్లతో వంతెనలు నిర్మించిన వైఎస్‌
కొండ కాలువల ప్రవాహానికి గిరిజనులు మృతులను నివారించాలనే ఉద్ధేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రౌతుగూడెం, పడమర రేగులకుంట, గాడిదబోరు, బైనేరువాగుపై సుమారు రూ.26 కోట్లతో హైలెవెల్‌ బ్రిడ్జిలు నిర్మించారు. దీంతో బయటి ప్రాంతంలోని ప్రజలకు వాగుల ప్రవాహ కష్టాలు తప్పాయి. అయితే కొండ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో మాత్రం వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు లేకపోవడం వల్ల సుమారు 4 నెలల పాటు గిరిజనుల బాధలు వర్ణనాతీతంగా మారతాయి. వర్షాకాలంలో వాగుల ప్రవాహం వల్ల గిరిజనులకు బయట గ్రామాలతో సంబంధాలు కూడా తెగిపోతూ ఉంటాయి. దాదాపు ఏజెన్సీ ప్రాంతంలోని వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో 60 గ్రామాలకు పైగా వాగుల బాధలు పడుతున్న గిరిజనులు ఉన్నారు. 

నిత్యం మూడు వాగులు దాటాలి
మాది బుట్టాయగూడెం మండలం చెంచుగూడెం. మా గ్రామానికి చేరాలంటే మూడు వాగులు దాటాలి. వీరన్నపాలెం, ఇప్పలపాడు జల్లేరువారు, పట్టినపాలెం వాగు. ఈ వాగులు దాటితే కానీ మా ఇంటికి చేరలేం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ గతంలో నిర్మించిన బ్రిడ్జిల వల్ల వాగుల సమస్య తీరింది. మరికొన్ని ఉన్నాయి. వాటి నిర్మాణానికి కూడా కృషి చేయాలని కోరుకుంటున్నా.
– బుద్ధుల జలపాలరాయుడు, చెంచుగూడెం, బుట్టాయగూడెం మండలం

వంతెనలను నిర్మిస్తా
నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాగుల ప్రవాహంపై సంభవిస్తున్న మరణాల గురించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకువెళ్లాను. వెనువెంటనే నాలుగు బ్రిడ్జిల నిర్మాణాలకు రూ.26 కోట్ల నిధులు మంజూరు చేశారు. పనులు కూడా పూర్తి చేశాం. ప్రధానమైన వాగు కష్టాలు తీర్చాం. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చి తాను ఎమ్మెల్యే అయిన వెంటనే వాగుల పరిస్థితిపై నివేదిక తయారు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.
– తెల్లం బాలరాజు, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement