నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడుతున్న సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడుతున్న సమయంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క అల్పపీడనద్రోణి, మరోపక్క ఉపరితల ద్రోణి, ఆవర్తనాలు ప్రభావం చూపుతున్నాయి. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలకు ఆస్కారమిస్తున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల అవర్తనం ఏర్పడింది. దీనికి తోడు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురవడానికి దోహదపడుతున్నాయి.
అలాగే, రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో రాయలసీమలో వర్షాలకు ఆస్కారం కలుగుతోంది. ఇవన్నీ మరో రెండ్రోజుల్లో బలపడే అవకాశం ఉండడంతో కోస్తాంధ్ర, రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) పేర్కొంది.