వరంగల్, న్యూస్‌లైన్ : ఐదు నెలల క్రితం స్టాంప్ చార్జీలను పెంచిన సర్కారు.. తాజాగా రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగించింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్, డెవలప్‌మెంట్ చార్జీలను భారీగా వడ్డించింది. ఏకంగా పదింతల మేర చార్జీలను పెంచి వినియోగదారుల నడ్డి విరిచింది. ఇప్పటివరకు రూ. పదుల్లోనే ఉన్న ఈసీ, సీసీ ధ్రువీకరణ పత్రాల చార్జీలను రెండింతలు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబర్ 463 జారీ చేయగా... కొత్త ధరలు ఆదివారం నుంచే అమల్లో పెడుతూ రెవెన్యూ శాఖ జీఓ నంబరు 757ను జారీ చేసింది.
ఫలితంగా జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు వినియోగించుకునే ప్రజలపై మోయలేని భారం పడుతోంది. పలు రకాల రిజిస్ట్రేషన్ సేవలు రూ. వెయియ నుంచి రూ. 10,000 వరకు పెరగడం గమనార్హం. టైటిల్ డీడ్ గతంలో 0.1 శాతం ఉండగా... ఇప్పుడు రూ. 10 వేలకు పెంచారు. డిపాజిట్ టైటిల్ డీడ్ రిలీజ్ చార్జీలు రూ. 200 ఉండగా... నేటి నుంచి రూ. వెయ్యి వసూలు చేయనున్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ సర్టిఫై కాపీ ఇప్పటివరకు రూ. 90 ఉండగా... రూ. 200కు పెరిగింది.
అదే విధంగా 30 ఏళ్లలోపు ఈసీ చార్జీ రూ. 90 ఉండగా... రూ. 200కు పెంచారు. 30 ఏళ్లు పైబడిన వాటి చార్జీలను రూ. 500కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యూయి. పెరిగిన ధరలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చేలా ప్రభుత్వం, రెవెన్యూ శాఖ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది. చిన్న చిన్న రిజిస్ట్రేన్లు, తాత్కాలిక పనులకు కూడా వినియోగదారులు ఇక రూ. 10 వేలు చెల్లించక తప్పదు. స్టాంపుల అమ్మకం , బహుమతి, సెటిల్‌మెంట్, రిలీజ్, పవర్ ఆటార్నీ, డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ తదితర సేవలు ఖరీదు కానున్నాయి.
ఐదు నెలల్లో మరోసారి
ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జిల్లాలో భూముల మార్కెట్ ధరలను పెంచేశారు. వాస్తవంగా ప్రతి ఏటా ఆగస్టు మొదటి వారంలో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచుతోంది. వాటికే ప్రజల నడ్డి విరుగుతుంటే... ఇప్పుడు రిజిస్ట్రేషన్ సేవలను అమాంతంగా ఒకటి నుంచి పదింతలకు పెంచుతునట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రేపటి నుంచి అమలు చేస్తాం
రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈసారి స్టాంప్ డ్యూటీ కాకుండా చార్జీలను మాత్రమే పెంచింది. ఆ దివారం ప్రభుత్వ సెలవు కాగా... పెరిగిన ధ రలను సోమవారం నుంచి అమలు చేస్తాం.
- పొట్లపల్లి శ్రీనివాసరావు,
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్-1
రిజిస్ట్రేషన్ చార్జీల మోత 10 రెట్లు
Published Sun, Sep 1 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement