సుభాషిణి మృతదేహం సుభాషిణి ప్రసవించిన మగశిశువు
హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో మాతృమరణాలు ఆగడం లేదు. ప్రసవాలపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. అత్యవసర కేసులకు మెరుగైన వైద్యం అందకపోవడం వల్లే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లా ఆస్పత్రి అని గొప్పగా చెప్పుకోవడమే కానీ వైద్యం ఆ స్థాయిలో అందడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురం, హిందూపురం అర్బన్: ప్రసవానంతరం తీవ్ర కడుపునొప్పి రావడంతో బాలింత మృతి చెందింది. హిందూపురం ప్రభుత్వాస్పత్రి వైద్యులు, నర్సుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన సుభాషిణి (24) గర్భిణి. నెలలు నిండటంతో పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యులు శనివారం పరిగి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి ఉమ్మనీరు పోతోందని గుర్తించి, వెంటనే హిందూపురం తీసుకెళ్లాలని సూచించారు. 108 వాహనం ఎంతసేపటికీ రాకపోవడంతో మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఆటోలో హిందూçపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యం..
శనివారం సాయంత్రం వరకు వైద్యులు పట్టించుకోలేదు. ఐదు గంటల సమయంలో బయట స్కానింగ్ చేయించుకురమ్మన్నారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రయివేట్ సెంటర్‌లో స్కానింగ్ చేయించుకుని తీసుకొచ్చారు. రాత్రి 7.45 వరకు వైద్యులు స్పందించి రక్తపరీక్షలు చేయించాలని బయటి నుంచి ల్యాబ్ వారిని పిలిపించారు. నొప్పులతో విలవిలలాడిపోతున్నా పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీశారు. దీంతో వారు అప్పుడు సిజేరియన్ చేయడంతో సుభాషిణి పండంటి మగబిడ్డను ప్రసవించింది. ఆదివారం ఉదయం నుంచి కడుపునొప్పిగా ఉందని నర్సులకు చెబితే మ«ధ్యాహ్నం ఒక ఇంజెక్షన్ వేశారు. అయినా అలాగే ఉందని చెప్పడంతో మరోనర్సు మూడు ఇంజెక్షన్లు వేశారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇంకో ఆరు ఇంజెక్షన్లు ఇచ్చారు. అప్పటికీ కడుపునొప్పి భరించలేకపోతున్నానని సుభాషిణి చెప్పడంతో 108 వాహనాన్ని పిలిపించి అనంతపురానికి రెఫర్ చేశారు. హిందూపురం దాటేలోపే సుభాషిణి ఊపిరి ఆగిపోయింది.
బాధ్యులపై చర్యలు తీసుకోండి
బాలింత మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, పైడేటి గ్రామస్తులు హిందూపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులు రాకుండా నర్సులతోనే ఇంజెక్షన్లు వేయిస్తూ సరైన వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందని సుభాషిణి భర్త అనిల్‌కుమార్ ఆరోపించాడు. ఆదివారం అయితే డాక్టర్లు డ్యూటీకి రారా.. అలాంటప్పుడు ‘సెలవు’ బోర్డు పెట్టొచ్చు కదా అంటూ ఆగ్రహించాడు. వైద్యులు డ్యూటీలో లేకుండా ఏం చేస్తున్నారంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులును నిలదీశారు. వైద్యం చేయలేనపుడు ఇక్కడ ఇంత పెద్ద ఆస్పత్రి ఎందుకంటూ మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గ్రామపెద్దలకు సీఐలు చిన్నగోవిందు, తమీం అçహ్మద్, వెంకటేశులు నచ్చజెప్పి శాంతింపజేశారు. బాధితులు చివరకు సూపరింటెండెంట్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment