వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం తిరుపతిలో భారీ ఎత్తున మోటారు సైకి ల్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీతో తిరునగరిలో సమైక్యనాదం హోరెత్తించింది.
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోమవారం తిరుపతిలో భారీ ఎత్తున మోటారు సైకి ల్ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి నేతృత్వంలో సాగిన ఈ ర్యాలీతో తిరునగరిలో సమైక్యనాదం హోరెత్తించింది. తుడ సర్కిల్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ తిలక్ రోడ్డు, నేతాజీ రోడ్డు, ప్రకాశం రోడ్డు మీదుగా పూలే విగ్రహం వరకు వెళ్లి, అక్కడి నుంచి మెటర్నిటీ ఆసుపత్రి రోడ్డు భవానీ నగర్, తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు చేరుకుని, తెలుగు తల్లి విగ్రహం, లీలామహల్ సర్కిల్ మీదుగా తుడ సర్కిల్ చేరుకుంది. ఉదయం 9.45 గంటలకు ప్రారంభమైన ర్యాలీ 11.30 గంటల వరకు సాగింది.
దీనికి ముందు ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ఎడారిలా కాకుండా ఉండేందుకు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జగన్ నాయకత్వంలో విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు విభజనకు ప్రధాన కారకుడని తెలిపారు. నిత్యం ప్రజల కోసమే ఆలోచించే జగన్ మోహన్ రెడ్డి జైల్లోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారని అన్నారు. జగన్ దీక్షకు సీమాంధ్రలోని ప్రజలు అందరూ జేజేలు పలుకుతున్నారని తెలిపారు.
ఇప్పటికే జిల్లా నీటి ఎద్దడితో అలమటిస్తోందని, విభజన జరిగాక, కృష్ణా, గోదావరి నదులపైన ఆనకట్టలు కడితే, పూర్తిగా ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసినా, ఇదే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ర్యాలీలో పాల్గొన్న మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రానికి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. అందుకే నేడు రాష్ట్రంలో ఈ పరిస్థితులు తలెత్తాయని తెలిపారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తెలంగాణ ఊసే లేదని గుర్తు చేశారు.
వైఎస్ తరువాత అంతటి సత్తా ఉన్న నాయకుడు జగన్‌మోహన్ రెడ్డేనని చెప్పారు. ర్యాలీలో ఎస్‌కె.బాబు, పార్టీ నగర కన్వీనరు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనరు కుసుమ, ఎస్సీ సెల్ కన్వీనరు రాజేంద్ర, తిరుమల కన్వీనరు చిన్నముని, వైఎస్సార్ సేవా దళం జిల్లా కన్వీనరు చొక్కారెడ్డిగారి జగదీశ్వరరెడ్డితోపాటు నాయకులు ఆదికేశవరెడ్డి, హర్ష, ఎంవీఎస్.మణి, హనుమంత నాయక్, తొండమనాటి వెంకటేష్ రెడ్డి, చెంచయ్య యాదవ్, ముద్ర నారాయణ, లతారెడ్డి, గీత, పునీత, గౌరి, గోపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.