పోలవరం నిర్వాసితులపై కదలిక
ఈనెల 25న జాతీయ పర్యవేక్షణ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు 1894 నాటి భూ సేకరణ చట్టం ఆధారంగా పరిహారం ఇస్తున్న అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అనేక పరిణామాల నేపథ్యంలో ఈనెల 25న జాతీయ మానిటరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణను 1894 నాటి చట్టం ఆధారంగా చేపట్టారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన ‘న్యాయమైన పరిహారం, భూసేకరణలో పారదర్శకత, పునరావాస హక్కు చట్టం-2013’లోని సెక్షన్ 24, సబ్ సెక్షన్ 2 ప్రకారం.. అంతకుముందు అమలులో ఉన్న చట్టం ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ప్రాజెక్టు ప్రాంతం నుంచి నిర్వాసితులు ఖాళీ చేయకపోయినా లేదా పరిహారం పొందకపోయినా, కొత్త చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు అర్హులవుతారు.
ఇప్పుడు పోలవరం ముంపు బాధితుల్లో మెజార్టీ ప్రజలు ఇంకా తమ స్థలాలు ఖాళీచేయనందున, పరిహారం పొందనందున వారికి కొత్త చట్టం ప్రకారం పరిహారం వర్తింపజేయాలని సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల విభాగానికి జనవరి 30న అప్పీలు చేశారు. దీనికి స్పందించిన ఆ విభాగం సంయుక్త కార్యదర్శి ప్రభాత్ కుమార్ సారంగి జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి బి.రాజేందర్‌కు అప్పట్లో ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో భూసేకరణ చట్టం-2013 అమలు బాధ్యతలు చూస్తున్న నేషనల్ మానిటరింగ్ కమిటీ సమావేశం కానుంది.
నివేదిక సమర్పించాలి..
తొలిసారిగా జరగనున్న జాతీయ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలవరం పరిహారం అంశం ఉందని, దీనికి హాజరుకావాలని, ఒక సమగ్ర నివేదిక కూడా సమర్పించాలని కోరు తూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిం ది. పెంటపాటి పుల్లారావు ఇచ్చిన పిటిషన్‌ను ఈ కమిటీ సమావేశంలో విచారించనున్నారు.