సాక్షి, రాజమండ్రి : ‘రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. విడిపోయిన అన్నదమ్ముల్లా కాదు.. కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలి’- సమైక్య ఉద్యమంలో అందరిదీ ఇదే మాట. సమైక్య రాష్ట్ర పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న ఉద్యమం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే దాకా ప్రజ్వరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యమం 24వ రోజైన శుక్రవారం కూడా అదే స్థాయిలో కొనసాగింది. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ మండల గోదాముల్లో పనిచేసే హమాలీలు శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకూ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ శాఖ ఉద్యోగులు అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపక పోవడంతో 16 మంది ఉపాధ్యాయులు యూటీఎఫ్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో లంకా సత్తిబాబు(27) అనే ఆటో డ్రైవర్ శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తిబాబు రాష్ట్రం విడిపోతుందని మానసిక వ్యధకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్నేహితులు తెలిపారు.
రాజమండ్రిలో..
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు పుష్కరాల రేవు వద్ద రోడ్లు తుడిచారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన వాహనాన్ని అడ్డగించారు. సమీపంలోని ఉద్యోగ జేఏసీ నిరాహార దీక్షలకు మద్దతు పలికేందు ఆ శిబిరం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగా పెట్టబోయే పార్టీ విధి విధానాలు తెలపాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్‌లో నిరవధిక రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శిబిరానికి వచ్చి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగువారిని ముక్కలు చేసేందుకు కుట్రలు పన్నుతున్న సోనియాగాంధీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు.
బార్ అసోసియేషన్, జేఏసీ ఫెడరేషన్, మున్సిపల్ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, వాపారస్తుల జేఏసీలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ది రాజమండ్రి టైల్స్, శానిటరీ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ అసోసియేషన్ సభ్యులు నగరంలో ర్యాలీ చేసి కోటగుమ్మం చేరుకుని వర్తక సంఘం జేఏసీ చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. ఆంధ్రకేసరి యువజన సంక్షేమ సంఘం, గ్రంధి రామచంద్రరావు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పాల్‌చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కశాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలో కడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడవ రోజుకు చే రాయి. రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. బొమ్మూరులో వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షా శిబిరం వద్ద వీర్రాజు ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకుని పార్టీ నేతలు నిరసన తెలిపారు. బొమ్మూరులో పార్టీ నాయకుడు నక్కా రాజబాబు, వేమగిరిలో రావిపాటి రామచంద్రరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలను ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాతేరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. ఏపీ ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
కాకినాడలో...
న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు వద్ద వినూత్నంగా గంజి వార్పు కార్యక్రమం చేపట్టి గంజి తాగారు. రాష్ట్ర విభజన చేపడితే తమకు గంజే గతి అంటూ నిరసన తెలిపారు. వి.ఎస్. లక్ష్మి కళాశాల, బీఈడీ కళాశాలల విద్యార్థులు నగరంలో ర్యాలీ చేసి భాసుగుడి వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. నర్సింగ్ విద్యార్థి అనూరాధ తెలుగుతల్లి వేషధారిణిగా ర్యాలీలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. పీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జెడ్పీ సెంటర్‌లో ర్యాలీ చేసి అనంతరం రాస్తారోకో చేపట్టారు. జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య వాదులు చీపుర్లు చేత పట్టుకుని రోడ్లు తుడిచారు. జేఎన్‌టీయూకే వద్ద విద్యార్థులు, కలెక్టరేట్ వద్ద వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ జేఏసీ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆ శాఖ సిబ్బంది, డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ప్రభుత్వ డ్రైవర్లు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు కోర్టుల వద్ద, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం జగన్నాథపురంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరంలో పాఠశాల విద్యార్థులు రోడ్డుపై మానవహారంగా ఏర్పడ్డారు. రమణయ్యపేటలో వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. మాధవపట్నం చైతన్య కళాశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు రిలే దీక్షలు కొనసాగించారు.
కోనసీమలో..
కోనసీమ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆటోలు, మినీ వ్యాన్‌లు, లారీలు, ట్యాక్సీలు, ఆర్టీసీ అద్దెబస్సులు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ జరిగింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలతో సాగిన ర్యాలీ పట్టణాన్ని వాహనాలతో నింపేసింది. అమలాపురం పట్టణ శెట్టిబలిజ యువత అధ్యక్షుడు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సమైక్య వాదులు పట్టణంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల సెంటర్‌లో వంటావార్పూ చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, నియోజక వర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు సంఘీభావం వ్యక్తం చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు సంఘీభావం తెలిపారు. కోనసీమకు చెందిన మత్స్యకారులు వందల సంఖ్యలో అమలాపురం తరలి వచ్చి గడియార స్తంభం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అల్లవరం మండలం ఓడలరేవులో వర్తక సంఘం వంటా వార్పూ చేపట్టింది. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి గ్రామం నుంచి అమలాపురం వరకూ యువకులు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. ఎన్.కొత్తపల్లి గ్రామంలో పంచాయతీల పాలకవర్గం, గొల్లవిల్లిలో రేషన్ డీలర్లు ర్యాలీలు చేశారు.
దీక్షలు భగ్నం
వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా గత ఐదురోజులుగా ఆ పార్టీ నేతలు పెయ్యల చిట్టిబాబు, మిండి గోవిందరావు, పోలిశెట్టి నాగేశ్వరరావు ముమ్మిడివరంలో చేస్తున్న దీక్షలను శుక్రవారం పోలీసులు భగ్నం చేసి వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారు చికిత్సకు నిరాకరించి ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష భగ్నానికి నిరసనగా ముమ్మిడివరంలో విద్యార్థులు, జేఏసీ నేతలు, మహిళలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తపేటలో ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేసి పాతబస్టాండ్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. న్యాయశాఖ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్‌లు కట్టుకుని పాత బస్టాండ్ వరకూ ర్యాలీ చేశారు. చేపలు, మాంస విక్రయదారులు దుకాణాలు బంద్ చేసి పాత బస్టాండ్ సెంటర్ వరకూ ర్యాలీ చేశారు. రావులపాలెంలో జేఏసీ సభ్యులు, సమైక్యాంధ్ర వాదులు, విద్యార్థులు ర్యాలీ
నిర్వహించారు.
విజయమ్మ దీక్షకు మద్దతుగా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో వికలాంగులు పాల్గొన్నారు. వారికి రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ సంఘీభావం తెలిపారు. పెదపట్నంలంకలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఆరు ప్రాధమిక పాఠశాలలను స్థానికులు నిరవధికంగా మూసి వేయించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వెలువడే వరకూ పాఠశాలలు తెరవరాదని అల్టిమేటం జారీ చేశారు. అంబాజీపేటలో వ్యాపారులు, రైతులు అరటిగెలలను సైకిళ్లకు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్‌జీసీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద సమైక్యవాదులు రాస్తారోకో చేసి వంటా వార్పు నిర్వహించారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల పంచాయతీ వీఆర్వోలు గుడిమిలంక వంతెన వద్ద రాస్తారోకో చేశారు.
పిఠాపురంలో బంద్
జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు. పట్టణంలోకి వచ్చే రహదారులు మూసివేసి సైకిళ్లు కూడా తిరగనివ్వలేదు. శుక్రవారం పిలుపునిచ్చిన బంద్ సంపూర్ణంగా సాగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, జేఏసీ సభ్యులు వేర్వేరుగా ర్యాలీలు చేశారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సంఘీభావం తెలిపారు. తునిలో జేఏసీ, ఎన్‌జీఓలు, వెఎస్సార్ కాంగ్రెస్ వేర్వేరుగా చేపడుతున్న రిలే దీక్షలకు పార్టీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. శోభారాణి సంఘీభావం తెలిపారు.
మెట్టలో మారుమోగిన సమైక్య నాదం
విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఏలేశ్వరం బాలాజీ సెంటర్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ రాస్తారోకో చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీ చేసి బాలాజీ చెరువు సెంటర్‌లో మానవహారం గా ఏర్పడారు. జగ్గంపేటలో విద్యార్థులు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. వైద్య సిబ్బంది పీహెచ్‌సీ ఆవరణలో వంటా వార్పూ చేసి సహపంక్తి భోజనాలు చేశారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో రాజానగరంలో సమైక్యవాదులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మండపేటలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మోకాళ్లపై నిలబడి కలువపువ్వు సెంటర్‌లో రాస్తారోకో చేపట్టారు. రామచంద్రపురంలో బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగులు మోటారుసైకిల్ ర్యాలీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు బస్సులతో ప్రదర్శన చేశాయి.
ఏజెన్సీ ప్రాంతంలో కూడా సమైక్య నాదం బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో అడ్డతీగలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రంపచోడవరంలో సమైక్య ర్యాలీ చేశారు. అంబేద్కర్ సెంటర్‌లో గెజిటెడ్ అధికారులు దీక్షలు చేపట్టారు.
లక్ష్యం చేరేవరకూ.. ఆగదు సమరం
Published Sat, Aug 24 2013 2:00 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement