=సమైక్య శంఖారావానికి సిద్ధమైన సమైక్యవాదులు
=అన్ని సంఘాల నుంచి సర్వత్రా మద్దతు
=పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు
=భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నుంచి 55 బస్సులు
=చెవిరెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిల నేతృత్యంలో మరో రైలు
తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లా నుంచి శుక్రవారం అన్ని దారులూ హైదరాబాద్ వైపే మళ్లనున్నాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే సమైక్య శంఖారావానికి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దయెత్తున వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం బయలుదేరి శనివారం ఉదయానికల్లా రాజధానికి చేరుకోవడానికి ఏ ర్పాట్లు చేసుకున్నారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 మినీ, ఐదు ఓల్వో బస్సు లు బయలుదేరనున్నాయి. కొంతమంది రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్నారు.
మాజీ మంత్రి, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి ఆధ్వర్యం లో చిత్తూరు నుంచి శుక్రవారం సాయంత్రం 4.30 గం టలకు ప్రత్యేక రైలు బయలుదేరనుంది. ఇది 5.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక్కడున్న వారిని ఎక్కించుకుని హైదరాబాదుకు వెళుతుంది. పీలేరు నుంచి పది బస్సులు ఏర్పాటు చేశారు. పార్టీ చంద్రగిరి, శ్రీకాళహస్తి ని యోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు చంద్రగిరి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది.
తిరుపతి మీదుగా శ్రీకాళహస్తికి రాత్రి 8గంటలకు చేరుకుంటుంది. శ్రీకాళహస్తి నుంచి ఆరు ప్రత్యేక రైలు బోగీలను ఏర్పాటు చేశారు. పలమనేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆ ద్వర్యంలో వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నుంచి వెళ్లే రైళ్లు శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరి ఆదివారం ఉదయానికి తిరిగి చేరుకుంటాయి.
హాజరుకానున్న వివిధ సంఘాల నేతలు
పార్టీ శ్రేణులతోపాటు జిల్లాకు చెందిన వివిధ సంఘాల నేతలు, సభ్యులు సమైక్య శంఖారావానికి హాజరుకానున్నారు. తిరుపతి నుంచి ఆర్‌టీసీ ఉద్యోగులు, టీటీడీ యూనియన్ నాయకులు, ఎస్‌వీ యూనివర్సిటీకి చెందిన వెయ్యి మంది విద్యార్థులు బయలుదేరుతున్నారు. చిత్తూరు నుంచి ఎన్‌జీవో నాయకులు, విద్యార్థులు వెళుతున్నారు. పలమనేరు జేఏసీ నాయకులు చిత్తూరు నుంచి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు రిజర్వేషన్ చేయించుకున్నారు. కొన్ని ప్రయివేటు బస్సులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో మండలానికి రెండు వందల మంది చొప్పున వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మదనపల్లె నుంచి ఉపాధ్యాయ, ఇతర సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. సత్యవేడు ప్రాంతానికి చెందిన జేఏసీ నాయకులు జిల్లాలో బస్సులు దొరక్క తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు.