సాక్షి, రంగారెడ్డి జిల్లా: మంత్రులు మాయమాటలు చెప్పి పండ్ల మార్కెట్‌ను అర్ధరాత్రి తరలించారని ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన కోహెడ పండ్ల మార్కెట్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా పండ్ల వ్యాపారులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అరకొర సౌకర్యాలు కల్పించి పూర్తిస్థాయిలో మార్కెట్ పూర్తయ్యిందని ప్రభుత్వం అబద్ధాలు చెబుతుందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారా లేరా అనేది అర్థం కావడంలేదని విమర్శించారు. మార్కెట్‌లో నీరు, తిండి కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస సౌకర్యాలు లేని ప్రాంతంలో పండ్ల మార్కెట్‌ని తరలించారని ఆయన మండిపడ్డారు.
(‘టీఆర్‌ఎస్ మత రాజకీయాలకు పాల్పడుతోంది’)
నగరంలో జనసంద్రం ఎక్కువ ఉన్న ప్రాంతం నుంచి పండ్ల మార్కెట్‌ని ఆకస్మాత్తుగా తరలించడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పండ్ల మార్కెట్‌కి వస్తున్నవారికి టెస్టులు చేయడంలేదన్నారు. కోహెడ్ మార్కెట్ నిర్మాణం కోసం రూ.100 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోహెడ పరిసర ప్రాంతాల గ్రామాలకు వాహనాల వల్ల ఇబ్బంది కలగకుండా ప్రత్యేక రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రైతులకు,వ్యాపారులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రాచకొండ సీపీతో మాట్లాడి పోలీసు చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు తక్కువగా చేస్తూ తప్పుడు సమాచారం ప్రజలకు అందిస్తున్నారని ప్రభుత్వంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిప్పులు చెరిగారు.
(కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : మంత్రి)
Comments
Please login to add a commentAdd a comment