
మేడం.. నా రాజీనామాను ఆమోదించండి: లగడపాటి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఎంపీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం తన హక్కు అని విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. తన రాజీనామాను ఆమోదింపజేసుకునేందుకు ఆయన స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. స్పీకర్ మీరాకుమార్ లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.
ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా తనకు రాజీనామా చేసే హక్కుందని, వెంటనే ఆమోదించాలన్నారు. రాజీనామా ఆమోదం కోసం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇతర రాష్ట్రాల ఎంపీలు రాజీ నామాలు చేస్తే వెంటనే ఆమోదించారని గుర్తు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
మీరాకుమార్.. లగడపాటి రాజీనామాను ఆమోదిస్తారా లేక మరోసారి ఈ విషయంపై చర్చించే అవకాశముందా అన్నది కచ్చితంగా తెలియరాలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్రానికి చెందిన ఇతర ఎంపీలు రాజీనామాలు చేసినా వీటిపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ లగడపాటి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఇదిలావుండగా, తెలంగాణ అంశంపై తలెత్తుతున్న పరిణామాల వల్ల మరింతమంది ఎంపీలు రాజీనామాలు చేసే అవకాశముందని, దీనివల్ల ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందని ఎన్సీపీ అధినేత, కేంద్రమంత్రి శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు.